కొన్ని ప్రాంతాల్లో భోగి రోజే ప్రారంభిస్తున్న కోడి పందేలు
ఎప్పటిలాగే ఈ సంక్రాతికి కూడా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా కూడా కోడి పందాలకు సిద్దమవుతున్నాయి. ఈ మూడు జిల్లాల్లో కోడి పందాల నిర్వహణకు పెద్ద యోత్తున బరులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి నియోజవకర్గంలో పదుల సంఖ్యలో బరులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ప్రధాన బరికి అనుబంధంగా మరో పదో పదిహేనో బరులు ఏర్పాటు చేస్తున్నారు నిర్వహకులు. కోట్ల రూపాయల వ్యయంతో బరులు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే 25, 30 ఎకరాల్లో బరులు ఏర్పాటు చేయడానికి ఈవెంట్ మేనేజ్మెంట్ కమిటీలకు నిర్వహణ బాధ్యతలకు అప్పగిస్తున్నారు. కొన్ని ప్రధాన బరుల్లో కేవలం బరి నిర్వహణకే కోటి రూపాయల పైచిలుకు వ్యయం చేస్తున్నారు. అలాగే గుండాట, లోనా బయట, మూడు ముక్కలాట వంటి జూద క్రీడలు కోడిపందాల బరికి అనుబంధంగా నిర్వహించడానికి కూడా పాటు పెడుతున్నారు. ఈ జూద క్రీడల నిర్వహణ దక్కించుకోవడానికి దాదాపు 50 లక్షల నుంచి 75 లక్షల వరకూ వేలం పాటలో దక్కించుకుంటున్నట్లు సమాచారం. వీటితో పాటు కోడి పందాల బరుల దగ్గర తాత్కాలిక మధ్యం విక్రయ కేంద్రాలు ఏర్పాటుకు కూడా నిర్వాహకులు డబ్బలు వసూలు చేయడం జరుగుతోంది. పగలూ, రాత్రి అనే తేడా లేకుండా 24 గంటలు షిఫ్ట్‌ల ప్రకారం బరులు నిర్వహించడానికి వీలుగా బరుల చుట్టూతా మిరుమిట్లు గొలిపే ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మూడు రోజులు కోడిపందాల ఈవెంట్ ను చిత్రీకరించడానికి డ్రోన్లు, అత్యాధునిక కెమెరాలను కూడా సిద్దం చేసుకున్నారు. ఆహుతులకు మంచి మంచి వంటకాలు అందిచడానికి మంచి వంటవాళ్ళను పురమాయించారు. కృష్ణా జిల్లాలో ఈడ్పుగల్లు, ఉప్పులూరు, అంపాపురాల్లో కోడిపందాల నిర్వహణకు పెద్ద పెద్ద సెట్టింగులు వేసి బరులు ఏర్పాటు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో అయితే భోగి రోజు నుంచే కోడిపందాల నిర్వహణకు సిద్దమైపోయారు. భీమవరం, ఉండి నియోజవకర్గాల్లో దాదాపు ప్రతి మేజర్ గ్రామాల్లో కోడి పందాల నిర్వహణకు బరులు ఏర్పాటు చేశారు. అలాగే తాడేపల్లి గూడెం, కోయలగూడెం, దెందులూరు, దేవరపల్లి నల్లజర్ల, గోపాలపురం తదితర ప్రాంతాల్లో కూడా బరులు ఏర్పాటు చేశారు. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లలో అయితే మురమళ్ల, ఆత్రేయపురం, కడియం, నేమాం, సూర్యారావుపేట, కాట్రేనికోన తదితర ప్రాంతాల్లో పెద్ద పెద్ద బరులు ఏర్పాట్లు చేశారు. అత్యంత భద్రత నడుమ ఎంట్రీ పాసులు కూడా జారీ చేసి మరీ కోడి పందాల నిర్వహణకు అన్నీ సిద్దం చేశారు నిర్వాహకులు.