30.2 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

అమరావతి నిర్మాణ పనులకు ముహూర్తం ఖరారు

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. పనులు ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్‌ చేసిందని తెలుస్తోంది. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి కచ్చితమైన ముహూర్తాన్ని ఈనెల 15వ తేదీ లోపు ప్రభుత్వమే అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరిగేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టనుంది. గతంలో చోటు చేసుకున్న అనుభవాల నేపథ్యంలో వచ్చే మూడేళ్లలోనే అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయ్యేలా సర్కారు కార్యాచరణ రూపొందించిందని చెబుతున్నారు. పూర్తిస్థాయిలో అమరావతిని ఈ ప్రభుత్వం హయాంలోనే అందుబాటులోకి తీసుకు రావాలని చంద్రబాబు టార్గెట్‌గా పెట్టుకున్నారు.

ఏపీలో ఎన్డీయే నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి అమరావతి రాజధాని విషయంలో కదలిక వచ్చింది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిగా అమరావతిని ఎంపిక చేశారు. అప్పుడే అమరావతి నిర్మాణ పనులు కూడా ప్రారంభించేశారు. అయితే, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో, సీన్ పూర్తిగా మారిపోయింది. రాజధానిగా అమరావతి స్థానంలో మూడు రాజధానుల అంశాన్ని అప్పటి వైసీపీ సర్కారు తెరపైకి తీసుకు వచ్చింది. అయితే, మూడు రాజధానుల నిర్మాణం వైసీపీ హయాంలో అంతగా ముందుకు సాగలేదు. విధాన పరమైన నిర్ణయమైతే తీసుకున్నప్పటికీ నిధుల కొరత కారణంగా మూడు రాజధానుల అంశం దాదాపు ప్రతిపాదనల దగ్గరే ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ కూటమి అధికారంలోకి రావడంతో రాజధాని నగరంగా అమరావతి నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో కూటమి సర్కారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటంతో కేంద్రం సైత అమరావతి రాజధాని నిర్మాణానికి అన్ని విధాలా సహకారం అందిస్తోంది. ఇప్పటికే కేంద్రం రూ.15వేల కోట్లు అమరావతి నిర్మాణానికి ప్రకటించింది. మరోవైపు.. వివిధ సంస్థల ద్వారా పెట్టుబడి కూడా సేకరిస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి దాదాపు రూ.40 వేల కోట్లు సమీకరించింది కూటమి సర్కారు. అటు.. అటు వివిధ సంస్థలు కూడా అమరావతిలో కార్యకలాపాలు మొదలు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఓవైపు.. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం.. మరోవైపు.. ప్రైవేటు సంస్థల భవనాల నిర్మాణం కూడా ఏక కాలంగా మొదలయ్యే అవకాశం ఉంది. 2028 నాటికి రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేయాలన్న బలమైన సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఏపీలో 2029లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ సమయంలోగా రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం బలమైన లక్ష్యంగా పెట్టుకుంది. అలా పూర్తి చేస్తేనే.. తమ హయాంలోనే రాజధాని నిర్మాణం పూర్తి చేశామని చెబుతూ.. కూటమి ప్రభుత్వాన్ని మళ్లీ ఆదరించాలని కోరుతూ ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు అండ్‌క కో భావిస్తున్నారు. ఇక, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అమరావతి రాజధాని నిర్మాణ పనులను మొదటినుంచీ పర్యవేక్షిస్తున్నారు. తమ సొంత శాఖ కంటే రాజధాని నిర్మాణానికి ఆయన అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com