రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్సీలకు పార్టీల తరపున అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చింది. ఐదు ఎమ్మెల్సీల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాకే అగ్రతాంబూలం దక్కింది. రాష్ట్రంలో సీనియర్ నేతలు, గ్రూపులు, విధేయులు అని పలు రకాలుగా చర్చలు జరిగినా …ఫైనల్‌గా నల్గొండ జిల్లాకు మేలు జరిగిందని జిల్లా నేతలు సంబరపడుతున్నారు.
అద్దంకి దయాకర్ 2014, 2019 ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయాడు. 2024లో నల్గొండ జిల్లా రాజకీయాల్లో అనూహ్యంగా మందుల సామేలు పేరు తెరమీదకు వచ్చింది. పార్టీ నిర్ణయాన్ని శిరసావహించి అద్దంకి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. సూర్యపేట జిల్లా నెమ్మికల్‌కు చెందిన అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ దక్కటంపై పార్టీలో అన్నివర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
నల్గొండ డిసిసి అధ్యక్షుడు కతావత్ శంకర్‌నాయక్‌కు ఎమ్మెల్సీ పదవి దక్కటం జిల్లా నేతలనే విస్మయపరిచింది. దామరచర్ల జడ్‌పిటిసిగా జనరల్ స్థానంలో గెలిచిన శంకర్‌నాయక్ పార్టీ విధేయునిగా కొనసాగుతున్నారు. జానారెడ్డికి సన్నిహితుడుగా పేరున్న శంకర్‌నాయక్ ఎస్‌టి కోటాలో వచ్చిందంటున్నారు.
కాంగ్రెస్ మిత్రపక్షం సిపిఐ నుంచి ఎంపిక చేసిన నెల్లికంటి సత్యం కూడా నల్గొండ జిల్లా వాసి కావడం గమనార్షం. మునుగోడు నియోజకవర్గానికి చెందిన నెల్లికంటికి 2024 ఎన్నికల సమయంలోనే సిపిఐ నాయకత్వం హామీ ఇచ్చింది. పొత్తుల్లో మునుగోడు సిపిఐకి ఇవ్వాల్సి ఉండగా కూనంనేని సాంబశివరావు కోసం కొత్తగూడెం కేటాయించారు. అటు రాజగోపాల్‌రెడ్డి కూడా మునుగోడు కోసం పట్టుపట్టారు. దీంతో తదుపరి ఏ అవకాశం వచ్చినా నెల్లికంటికే అని పార్టీ నాయకత్వం భరోసా ఇచ్చింది.
బీఆర్‌ఎస్ నుంచి ఎంపికైన దాసోజు శ్రవణ్ మూలాలు కూడా నల్గొండ జిల్లా నుంచే కావడం కాకతాళియం. దాసోజు విద్యాబ్యాసం అంతా హైదరాబాద్ కేంద్రంగా సాగినా ఆయన తల్లిదండ్రులు నల్గొండ జిల్లా వారే.
నల్గొండ జిల్లా నుంచి ఎంపిక చేసిన అందరు అభ్యర్థులు ఆయా పార్టీలకు విధేయులు కావడం గమనార్హం. ఈ విషయంలోనే ఉత్తర తెలంగాణ నేతలు కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ విధేయతే కోలమానం అయితే ఉత్తర తెలంగాణలో అనేక మంది నేతలు ఉన్నారని వాదిస్తున్నారు. విదేయత పేరుతో కొన్ని వర్గాలకు, నేతలకు విధేయత ప్రకటించే నేతలకు పదవులు ఇప్పించుకున్నారని చర్చించుకుంటున్నారు.
విధేయతే కోలమానం అయితే గాంధీభవన్ ఇంచార్జి కుమార్‌రావు 40 ఏళ్ల నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నారని అంతకన్నా సీనియర్ ఎవరున్నారని హస్తం నేతలు చర్చించుకుంటున్నారు.
నల్గొండ జిల్లాకు ఇప్పటికే మంత్రి పదవులు అధికంగా కేటాయించారని ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులు కూడా కేటాయించి పార్టీ శ్రేణులకు, ఇతర ప్రాంతాల ప్రజలకు ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వదలుచుకున్నారని సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అంటే దక్షిణ తెలంగాణ పార్టీగా ముద్రపడే ప్రమాదం ఉందంటున్నారు.
పార్టీ పదవులు, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లో ప్రాంతాలు, సామాజిక ఆంశాల సమతౌల్యం జరగకపోతే బీఆర్‌ఎస్ మాదిరిగానే కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బలు తప్పవని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.