ఆయన నాలుగు దశాబ్ధాల పైచిలుకు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో దాదాపు మూడు దశాబ్ధాలు నెంబర్ టూగా కొనాసాగారు. పార్టీ అధికారంలో ఉన్న లేకున్న ఆయన హవా కొనసాగుతుండేది. ఈ నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో పదవి లేకుండా ఆయన ఎప్పుడూ లేరు. ఎమ్మెల్యేగానో, ఎమ్మెల్సీగానో మంత్రిగానో, స్పీకర్‌గానో ఇలా ఏదో ఒక పదవి ఆయన్ని వరించేది. కొన్ని సార్లు ప్రతిభ కారణంగా, కొన్ని సార్లు సామాజిక సమీకరణల వల్ల మరి కొన్ని సార్లు ఆయనంటే అధిష్టానానికి ఉన్న భయం వల్ల కూడా ఆయన పదవిని పొందిన సందర్భాలు ఉన్నాయి. ఇక పార్టీ పరంగా అయితే ముప్పే ఏళ్లు ఆయన పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక సంఘమైన పోలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగారు. ఇంతకీ ఆయన ఎవరో కాదు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు. నలభై ఏళ్ళ పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలను శాసించడమే కాకుండా టీడీపీలో నెంబర్ టూ గా ఉంటూ రాష్ట్ర రాజకీయాల్లో సైతం చక్రం తిప్పిన యనమల రాజకీయ జీవితం ఇక ముగిసినట్లే. ప్రస్తుతం ఆయన అనుభవిస్తున్న శాసన మండలి సభ్యత్వం ఈనెల 29వ తేదీతో ముగిసిపోతుంది. అయితే తాజా జరుగుతున్న ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వక పోవడంతో ఇక యనమల రాజకీయ ప్రస్తానం ఇక్కడితో ఆగిపోయినట్లే.
తెలుగుదేశం పార్టీలో మారిన రాజకీయ పరిణామాలు యనమ రాజకీయ జీవితానికి పులిస్టాప్ పెడుతున్నాయి. టీడీపీ యువనేత నారా లోకేష్ హవా అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోను అప్రతిహతంగా కొనసాగుతోందనడానికి యనమలకు ఎమ్మెల్సీ పదవి కొనసాగింపు ఇవ్వకపోవడమే ఒక ఉదాహరణ. చంద్రబాబు నాయుడు పార్టీలో సీనియర్ అయిన యనమల రామకృష్ణుడికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు. పార్టీలో తన నిర్ణయమై ఫైనల్ అనుకున్న రోజుల్లో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా యనమల శాసనసభ్యుడిగా గెలవకపోయినా ఎమ్మెల్సీగా చేసైనా మంత్రిమండలిలోకి తీసుకునే వారు చంద్రబాబు. అంతే కాకుండా కీలకమైన ఆర్థిక శాఖ ఆయనకు అప్పగించేవారు. పార్టీకి సంబందించిన కీలక నిర్ణయాల్లో కూడా యనమల మాటకు విలువుండేది. కానీ ఇప్పుడు పరిస్ధితులు మారాయి. చంద్రబాబు చేతిలోంచి నిర్ణయాధికారం నెమ్మది నెమ్మదిగా లోకేష్ చేతిలోకి వెళ్ళిపోతోంది. పార్టీకి సంబంధించి అయినా ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలైనా లోకేష్ మాటే ఫైనల్ ఈ నేపథ్యంలో చంద్రబాబు సహచరులందరినీ లోకేష్ పక్కకు జరిపేస్తున్నారు. ఈ రాజకీయ ప్రక్రియలో యనమలకు చట్టసభల్లోకి వెళ్లే ఛాన్స్ మిస్సైపోయింది.
వాస్తవానికి యనమల రామకృష్ణుడి కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు చట్ట సభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యనమల సొంత నియోజకవర్గం తుని నుంచి ఆయన కుమార్తె యనమల దివ్య శాసనసభ్యురాలిగా ప్తాతినిధ్యం వహిస్తుండగా, ఆయన అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ ఏలూరు లోక్‌సభ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక యనమల వియ్యంకుడు, పుట్టా మహేష్ యాదవ్ తండ్రి అయిన పుట్టా సుధాకర్‌యాదవ్ కడప జిల్లా మైదుకూరు శాసనసభ్యుడిగా ఉన్నారు. కుటుంబంలో ఇంతమంది చట్ట సభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో యనమల అవకాశాలకు గండి పడింది. దానికి తోడు 2024 ఎన్నికల సందర్భంగా కూటమి పొత్తులో భాగంగా త్యాగాలు చేసిన వారికి ప్రభుత్వంలో సరైన ప్రాతినిధ్యం కల్పించకుండా యమనలకు ఈ సారి ఎమ్మెల్సీ పదవి ఎక్స్‌టెన్షన్ ఇస్తే అది పార్టీ క్యాడర్‌ను అసంతృప్తికి గురిచేస్తుందనే వాదన ఉంది. దీంతో యనమలను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇక ముందుకు కూడా ఎమ్మెల్సీ అవకాశాలు వచ్చినా ఆశావాహుల జాబితా చాంతడంత ఉండటంతో భవిష్యత్తులో సైతం యమలకు దక్కే అవకాశం లేదని టీడీపీ యంగ్ జనరేషన్ నాయకులు అంటున్నారు. మొత్తం మీద నలభై ఏళ్ళ యనమల రాజకీయ జీవితానికి, చట్ట సభల్లో ప్రాతినిధ్యానికి ఈ సంవత్సరం ఏప్రిల్ మాసంతో తెరపడినట్లే.