30.2 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

2029కి ఇప్పటినుంచే చంద్రబాబు రూట్‌మ్యాప్‌

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2029లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పుడే దృష్టి పెట్టారు. ఆ ఎన్నికల్లో ఏపీ ప్రజలను ఆకట్టుకోవాలంటే ఏం చేయాలన్న ఆలోచనకు పదును పెడుతున్నారు. అందుకే రాష్ట్రంలో ప్రధానమైన అమరావతి నిర్మాణం ఆలోగానే పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఈ లక్ష్యం కోసమే.. బిజెపి, జనసేనలతో బలమైన సంబంధాలు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపం చేస్తున్ఆరు చంద్రబాబు. ఎందుకంటే.. చంద్రబాబు ఎక్కువగా సేఫ్ జోన్‌లో ఉండటానికి ప్రయత్నిస్తుంటారన్నది రాజకీయాల గురించి ఏమాత్రం అవగాహన ఉన్నవాళ్లకైనా తెలుసు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో లాభనష్టాలు బేరీజు వేసుకొని చంద్రబాబు ముందుకు సాగుతుంటారు. అందుకే 2024లో హిట్ అయిన కాంబినేషన్ ఇలాగే కొనసాగాలని బాబు భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మూడు పార్టీల కూటమి సూపర్ హిట్ కావడంతో.. 2029 లో కూడా ఇదే బంధాన్ని కొనసాగిస్తూ ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. అంతకుముందు 2018లో ఎన్‌డీయేనుంచి బయటకు వచ్చిన చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకున్నారు. నరేంద్ర మోదీ ఆగ్రహానికి గురై అధికారానికి దూరమయ్యారు. ఐదేళ్ల పాటు రాజకీయంగా చాలా ఇబ్బంది పడ్డారు. అందుకే, మళ్ళీ అలాంటి పొరపాటు చేయవద్దని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే జాతీయస్థాయిలో ప్రధాని మోదీ జపం చేస్తున్నారు. వాస్తవానికి మోదీ చంద్రబాబు కంటే జూనియర్. ఈ విషయాన్ని చంద్రబాబు కూడా చాలా సార్లు బహిరంగ వేదికలపై చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పుడున్న రాష్ట్ర రాజకీయ సంక్లిష్ట పరిస్థితిలో కేంద్రంతో కలిసి ముందుకెళ్లాల్సిన అనివార్య పరిస్థితి ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని గానీ, ప్రదాని మోదీని గానీ ఏ విషయంలోనూ చంద్రబాబు ప్రశ్నించడం లేదు. వీలైనంత వరకూ విధేయత ప్రదర్శిస్తున్నారు. హిందీని రాష్ట్రాల మీద రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తుండడంపై విపక్షాలు, దక్షిణాది ఇతర రాష్ట్రాలు కూడా ఆగ్రహంతో ఉన్నాయి. మరోవైపు.. జనాభా ప్రాతిపదికన డీ లిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. పైగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఈ అంశంపై ఉద్యమం చేపడుతున్నారు. కానీ, ఎన్‌డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు మాత్రం ఈ విషయంలో నోరు మెదపడం లేదు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు ఎన్నడూ చూపని విధంగా కొన్నాళ్లుగా రాజకీయ ఉదారత చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. ఏపీలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన ఫోటో పెట్టించారు. పవన్‌ కల్యాణ్‌ సోదరుడు నాగబాబును ఎమ్మెల్సీగా చేసి మంత్రిగా అవకాశం కల్పిస్తున్నారు. అయితే, కేంద్రంలో నరేంద్ర మోదీకి, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్‌కు ప్రాధాన్యం ఇస్తే సరిపోతుందా? అలాగే చేస్తే తమ పరిస్థితి ఏంటని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యంగా 21 మంది ఎమ్మెల్యేలు ఉన్న జనసేనకు నాలుగు మంత్రి పదవులు ఇస్తే.. తెలుగుదేశం పార్టీనే నమ్ముకున్న వాళ్ల పరిస్థితి ఏంటని తెలుగు తమ్ముళ్లు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. బీజేపీ కూడా తమకు మరో మంత్రి పదవి కావాలని డిమాండ్‌ చేస్తోంది. అంతేకాదు.. రాష్ట్రంలో ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్సీల్లో జనసేనకు ఒకటి, బీజేపీకి మరొకటి కేటాయించారు చంద్రబాబు. మొత్తానికి ఏపీ సీఎం చంద్రబాబు దృష్టి మొత్తం 2029 ఎన్నికలపైనే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com