-
మొత్తం 65 కోట్ల మంది సందర్శించారని అంచనాలు
-
ఇది ఇంకా ఎక్కువే ఉండొచ్చన్న అధికారులు
-
ప్రశాంతంగా ముగిసిన మహాకుంభమేళా
-
నభూతో నభవిష్యత్ రీతిలో నిర్వహణ
-
తుది ఘడియల్లో 45 లక్షల మందికి పైనే స్నానాలు
-
తుది లెక్కలు రేపు తెలిసే అవకాశం
-
హర హర నామస్మరణతో మార్మోగిన త్రివేణి సంగమం
-
కాశీ విశ్వ నాధుని, అయోధ్యను దర్శించుకున్న భక్తులు
-
స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా సాగిన మేళా
మహా కుంభమేళా ఇవాల్టితో శాస్త్రోక్తంగా ముగిసింది.మహా శివరాత్రి పర్వదినం ఒక వైపు మహాకుంభమేళా ముగింపు ఘడియ కావడంతో ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా హర హరమహదేవ్ నామస్మరణతో మార్మోగిపోయింది. కోట్లాదిగా భక్తులు తరలి రావడంతో ఆ ప్రాంతం మహా జన సముద్రాన్నితలపించింది.త్రివేణి సంగమం లో హర హర మహదేవ్..శంభోశంకర అంటూ దిక్కులు పిక్కటిల్లేలా భక్తులు నినాదాలు చేశారు. మామూలు రోజుల్లో కంటే ముగింపు రోజున స్నాన ఘట్టాలన్నీ కిటకిటలాడిపోయాయి.
జన సమూహంతో కిటకిటలాడిన ప్రయాగ్ రాజ్ :
144 ఏళ్ల కొకసారి సంభవించే పవిత్ర ఘడియల్లో పుష్య పౌర్ణిమ రోజున గతనెల జనవరి 13న ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా అంగరంగ వైభవంగా ఆరంభమైంది.ఈ కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి ఇప్పటి వరకూ 65 కోట్ల మంది సందర్శించారు. ఇవాళ ముగింపు రోజు కావడం…అందులో మహా శివరాత్రి కావడంతో ప్రయాగ్ రాజ్ ఎటు చూసినా భక్తి భావమే..కోటాను కోట్ల మంది తమ చివరి పవిత్ర స్నానాలు చేశారు. ఇక సాధువులు, సన్యాసులు, యోగి పుంగవులు కూడా పవిత్ర స్నానాలు ఆచరించి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు.
ప్రయాగ్ రాజ్ లో పవిత్ర ఘడియలు ముగుస్తుండటంతో క్షణ క్షణానికి భక్తుల తాకిడి పెరిగిపోయింది. రాత్రి 2 గంటల సమయం నాటికి 11న్నర లక్షలమంది స్నానాలు చేయగా, ఆ తర్వాత రెండు గంటల్లో ఆ తాకిడి 25.64 లక్షలకు చేరుకుంది. ఉదయం ఆరు గంటలకు ఆ రష్ కాస్తా 41 లక్షల మందికి చేరుకుంది.
క్షణ క్షణం యోగీ సమీక్ష :
ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్ ఉదయం నాలుగు గంటలనుంచి తన ఇంట్లోనుంచి మహాకుంభమేళాను క్షణ క్షణం పర్యవేక్షిస్తూ ఉన్నారు. మునులు, కల్పవసీలు, భక్తులందరికీ మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ బోలేనాథ్ భగవంతుని ఆశీస్సులు, కృప, కరుణ, కటాక్షం భక్తులందరికీ కలగాలని యోగీ తన ఎక్స్ లో రాసారు.
పోటెత్తిన జన సందోహం :
ప్రపంచం నలుమూలల నుంచి హిందువులు పెద్ద సంఖ్యలోప్రయాగ్ రాజ్ తరలి వచ్చారు. అలాగే దేశం నలుమూలలనుంచి భక్త జనసందోహం తరలి వచ్చింది.ముగింపు రోజున బెంగాల్,ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్,కర్ణాటకల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వీరే కాక మహాకుంభమేళాను చూసేందుకు నేపాల్ నుంచి కొందరు భక్తులు వచ్చారు.లక్షల సంఖ్యలో జనం నిన్న సాయంత్రం నుంచే స్నానఘాట్ ల దగ్గర కనిపించారు. అది అంతకంతకూ పెరుగుతూ బ్రహ్మ ముహూర్తంలో చివరి స్నానం చేసేందుకు కొందరు ఓపికతో నిరీక్షించారు. చాలా మంది పవిత్ర స్నానాలకు ముందు చేయాల్సిన క్రతువులన్నీ శాస్త్రోక్తంగా పూర్తి చేసి బ్రహ్మ ముహూర్తం కోసం భక్తితో వేచి చూశారు.
విస్త్రృతమైన భద్రతా ఏర్పాట్లు :
గత నెలలో తొక్కిసలాటలో 30 మంది చనిపోవడంతో ఈసారి యోగీ ప్రభుత్వం కఠినమైన, విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎక్కడా రష్ అన్నది నిలిచిపోకుండా క్రౌడ్ మోనిటరింగ్ చేస్తూ అంతా సజావుగా సాగేలా చర్యలు తీసుకుంది.నోవెహికల్ జోన్ నిబంధనను కఠినంగా అమలు చేసి భక్తులకోసం రవాణా ఏర్పాట్లు చేసింది.
పోలీసుల పాత్ర అమోఘం :
స్నాన ఘట్టాల్లో రష్ ను తట్టుకుని, వచ్చినవారు వచ్చినట్లు స్నానాలు చేసి వెళ్లిపోయేలా,అలాగే కుంభమేళా ప్రాంగణంలో ఉన్న అయిదు శివాలయాల్లో భక్తుల దర్శన ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. శివ లింగానికి త్రివేణి సంగమం నీటితో భక్తులు అభిషేకం చేసుకునే వీలు కల్పించారు.విఐపీ దర్శనాలను రద్దు చేశారు.ఇక్కడి నుంచి భక్తులు నేరుగా వారణాసి వెళ్లి కాశీ విశ్వనాథుడిని సందర్శించుకునే వారికోసం ట్రాఫిక్ జామ్ లు లేకుండా చర్యలు తీసుకున్నారు.కీలక ప్రాంతాల్లో, కూడళ్లలో బారికేడ్లు పెట్టారు. అడుగడుగునా పోలీసులు భక్తులకు దిశా నిర్దేశం చేస్తూ రష్ ను, తొక్కిసలాటలను నివారించారు. నలుమూలల నుంచి వచ్చిన సందర్శకులు తిరిగి క్షేమంగా వెళ్లేందుకు రైల్వే స్టేషన్లలో వెయిటింగ్ ఏర్పాట్లు చేశారు