31.1 C
Hyderabad
Monday, October 26, 2026

Live Video

spot_img

తెలుగు రాష్ట్రాలను శాసిస్తోన్న వారసత్వ రాజకీయాలు

జంట తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను వారసత్వ రాజకీయాలే శాసిస్తున్నాయి. కుటంబ రాజకీయాలే పాలనలో, పార్టీలను నడిపించడంతో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అయితే, ప్రాంతీయ పార్టీల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లో ఇవేవీ కనిపించక పోయినా, స్థానిక పార్టీలు పూర్తిగా కుటుంబ రాజకీయాలే నడుపుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడూ. అధికారంలో లేనప్పుడూ ఇదే తీరు కనిపిస్తోంది.

ఒక రకంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వంలో కీలక పదవులైనా, నిర్ణయాలు తీసుకోవడంలో అయినా, పార్టీలో అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా పార్టీలకు ముందునుంచి అండగా ఉంటున్న వాళ్లకు కాకుండా.. పార్టీకి ఆపత్కాలంలోనూ అండగా ఉన్న వాళ్లను కాకుండా కుటుంబసభ్యులకే ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నారు. ఫలితంగా ఆయా పార్టీలను నమ్ముకున్న వాళ్లకు నష్టం జరుగుతోంది. అయినా పార్టీ నాయకులు ఈ పరిస్థితులను, పరిణామాలను ఎత్తిచూపే ధైర్యం చేయలేక పోతున్నారు. ఎందుకంటే.. ముఖ్య నేతలతో పాటు.. వాళ్ల కుమారులు, అల్లుళ్లు, కూతుళ్లే కీలక పొజిషన్‌లో ఉంటున్నారు. పార్టీలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా, ప్రభుత్వంలో ఏదైనా పని కావాలన్నా వాళ్లే కీలకం. కాబట్టి లోలోపలే మధన పడుతున్నప్పటికీ.. ఆయా పార్టీల ముఖ్యనేతలు గానీ, మొదటినుంచీ పార్టీలనే పట్టుకొని ఉన్న నాయకులు గానీ బాహాటంగా మాట్లాడే సాహసం చేయలేక పోతున్నారు.

తెలంగాణలో నిన్నా మొన్నటి దాకా పదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయి కుటుంబ పార్టీగా ముద్ర వేసుకుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సమయంలో ఆయన కుమారుడు కేటీఆర్ కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. అలాగే, కేసీఆర్‌ మేనల్లుడు హరీశ్ రావు కూడా మంత్రిగా ఉన్నారు. ఇక, కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవిత రాజ్యసభ సభ్యురాలిగానో, పార్లమెంటు సభ్యురాలి గానో లేదంటే ఎమ్మెల్సీగానో పదవులు పొందారు. ఇక, కేసీఆర్ దగ్గరి బంధువు సంతోష్ కుమార్‌కు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారు. ఇలా దాదాపు కీలక పదవుల్లో కుటుంబానికి సంబంధించిన వాళ్లకే అవకాశం దక్కింది. ఈ పరిణామాలే.. పదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణమయిందన్న విశ్లేషణలు వినపడ్డాయి. అయినప్పటికీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆ నలుగురే ఇప్పటికీ పార్టీని నడుపుతున్నారు. అంతకు మించి వేరే ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. ఎందుకంటే.. వందల కోట్ల రూపాయల నిధులున్న పార్టీ బాధ్యతలను కుటుంబం బయటి వ్యక్తులకు అప్పగించే సాహసాన్ని గులాబీ బాస్ కేసీఆర్‌ చేయలేరు.

అటు.. ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే… తెలుగుదేశం పార్టీలో కూడా వారసత్వ రాజకీయాలే శాసిస్తున్నాయి. గత యేడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఆ కుటుంబానికి చెందిన వాళ్లకే ఐదు టికెట్లు దక్కాయి. చంద్రబాబు, లోకేశ్, నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి పురంద్రీశ్వరి, శ్రీభరత్‌లు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా టిక్కెట్లు పొంది చట్టసభలకు ఎన్నికయ్యారు. మంత్రి వర్గంలోనూ నారా కుటుంబం నుంచి ఇద్దరున్నారు. పార్టీ కార్యకలాపాలు కూడా మొత్తం వాళ్లిద్దరే చూసుకుంటున్నారు. దీంతో, ఒక కుటుంబం చేతిలోనే ఆ పార్టీ ఉందన్నది విపక్షాల విమర్శ. ఇక, ఏపీలో విపక్ష నేత, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ కూడా అదే తరహా రాజకీయాల నుంచి వచ్చారు. తండ్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి వారసత్వ రాజకీయాలను అందుకుని సొంత పార్టీ పెట్టుకున్నారు. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. ఇక, అధికారంలో ఉన్నప్పుడు జగన్ బంధువులు కూడా టిక్కెట్లు పొందారు. పదవులు సాధించుకున్నారు. అయితే వైసీపీ పరంగా చూస్తే.. తండ్రి వారసత్వంతో సొంత పార్టీ పెట్టుకున్న జగన్‌.. వారసత్వ రాజకీయాలను మాత్రం ఇప్పటివరకు అనుసరించలేదు. బంధువులకు మాత్రం అవకాశాలిచ్చారు.

ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అయినా కుటుంబ రాజకీయాలకు దూరంగా ఉంటారని అంతా అనుకున్నారు. కానీ, ఆయన కూడా తనకుటుంబానికే ప్రాధాన్యత ఇస్తున్నారన్న కామెంట్స్ పార్టీలో జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా, ఎమ్మెల్సీ పోస్టుకు నాగబాబు నామినేషన్ వేయడంతో కొణిదల కుటుంబంలో మూడో వ్యక్తి పదవి పొందేందుకు అంతా రెడీ అయ్యింది. పార్టీ కోసం కష్టపడ్డారన్న పేరు మీద నాగబాబును ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంతో పాటు.. ఆయన కోసం ఓ మంత్రి పదవికి కూడా కర్చీఫ్‌ వేసుకున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కుటుంబ, వారసత్వ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. చిరంజీవి ఇప్పటికే కేంద్ర మంత్రిగా పనిచేసి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో నాగబాబు కూడా మంత్రి అయితే మరో కుటుంబం నుంచి కేబినెట్‌లో ఇద్దరు ఉంటారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com