- జగన్‌మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ చేరంది
- కాకినాడ్ పోర్ట్ వ్యవహారం మొత్తం విక్రాంత్‌రెడ్డే నడిపాడు
- సీఐడీ విచారణ అనంతరం మీడియాతో విజయసాయిరెడ్డి
జగన్మోహనరెడ్డి చుట్టూ కోటరీ ఉందని ఆ కోటరీ నుంచి బయటపడినప్పుడే ఆయనకు భవిష్యత్తు ఉంటుందని మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. కాకినాడ పోర్ట్‌కి సంబంధించిన కేసులో విచారణ నిమిత్తం బుధవారం ఆయన ఏపీ సీఐడీ కార్యాలయానికి వచ్చారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి తాను వైఎస్‌ఆర్‌సీపీకి రాజీనామా చేయడం వెనుక ఉన్న కారణాలను మీడియాకు వెల్లడించారు. జగన్ చుట్టూ ఒక కోటరీ ఉందని దాని వల్లే నేను ఆయనకు దూరమయ్యానని తెలిపారు. జగన్ మనసులో నాకు స్ధానం లేదని తెలిసిందని ఆ విషయం తెలిసి నా మనసు విరిగిపోయిందన్నారు. ఇదే విషయాన్ని నేను జగన్ కు చెప్పి పార్టీ నుంచి బయటకి వచ్చానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. కొందరు నేతలు జగన్ చుట్టూ కోటరీ గా ఏర్పడ్డారని… జగన్ ను ఎవరికైనా పరిచయం చేయాలంటే ఈ కోటరీ కి లాభం చేకూర్చాల్సి ఉంటుంది సాయిరెడ్డి ఆరోపణలు చేశారు. నాయుకుడు ఎప్పుడు ఇలాంటి చెప్పుడు మాటలు నమ్మకూడదని, చెప్పుడుమాటలు వినడం వల్ల నాయుడితో పాటు పార్టీ, ప్రజలు అందరూ నష్టపోతారని అన్నారు. వైసీపీలో అనేక అవమానాలు, కష్టాలు పడ్డానని అందుకే నాకు ఎన్నో పదవులు ఇచ్చినా అవమానాలు తట్టుకోలేక పార్టీని వీడానని చెప్పారు. నేను ప్రలోభాలకు లొంగానని, భయపడ్డానని, విశ్వసనీయత కోల్పోయానని నన్ను విమర్శిస్తున్నారని కానీ అవేం జరగలేదని నాకు భయమంటే ఏమిటో తెలియదని మా నాయకుడిలోనే మార్పు వచ్చిందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఒకప్పుడు మా నాయకుడు అంటే భక్తి ఉండేదని ఇప్పుడు అది దేవుడి మీదకు మళ్ళిందని చెప్పారు.
ఇదిలా ఉండగా దాదాపు మూడు గంటల పాటు సీఐడీ అధికారులు విజయసాయిరెడ్డిని విచారించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి తనకు ఆ కేసులో ఎటువంటి సంబంధం లేదని సీఐడీ అధికారులకు చెప్పినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన విషయాలేవీ నాకు తెలియదు నాకు ఎవ్వరూ చెప్పలేదని తెలిపానన్నారు. వాళ్ళ వ్యాపారానికి సంబంధించి నేను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేసినట్లు చెప్పారు. నా కుమార్తెను వాళ్ళ కుటుంబంలో ఇచ్చానే కానీ వాళ్ళ ఆర్థిక లావాదేవీల్లో గానీ వాళ్ళ వ్యాపార వ్యవహారాల్లో కానీ నేను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని సీఐడీ అధికారులకు చెప్పినట్లు వివరించారు. విక్రాంత్‌రెడ్డి మీకు తెలుసా అని అడిగారని కాకినాడ పోర్ట్ వ్యవహారం మొత్తం విక్రాంత్‌రెడ్డి నడిపినట్లు చెప్పానన్నారు. ఈ డీల్ విషయంలో జగన్మోహన్‌రెడ్డికి తెలియదని చెప్పానట్లు తెలిపారు. నన్ను ఒక అధికారి కావాలనే ఈ కేసులో ఇరికించారని, గతంలో ఏ2గా ఉన్నాను కాబట్టి ఇందులో కూడా ఏ2గా పేరు పెట్టారన్నారు. కేవీరావుతో నేను మాట్లాడినట్లు నిరూపించాలని అడిగినట్లు చెప్పారు. కేవీరావు ఒక రాజకీయ బ్రోకర్ అని అతనంటేనే నాకు అసహ్యం అని విజయసాయిరెడ్డి మీడియా ముందు తన అభిప్రాయాలను విస్పష్టంగా తెలియజేశారు.