ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే కేరళ నుంచి రప్పించిన కడవర్ జాతి డాగ్స్ సహకారంతో ఒకరి మృతదేహాన్ని గుర్తించారు. నిత్యం 157 మంది సాంకేతిక నిపుణులతో కూడిన బృందాలు, రెండు డాగ్స్ టన్నెల్‌లోకి వెళ్లి గాలింపు చర్యలు చేపడుతున్నాయి. లోకో ట్రైన్ ట్రాక్ పునరుద్ధరణ సక్సెస్ కావడంతో సహాయక చర్యలు మరింత వేగవంతం అయ్యాయి. 13.20 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ వెళ్లగలుగుతోంది. సహాయక చర్యలు స్పీడప్ చేయడానికి రోబోలను కూడా రంగంలోకి దింపారు. దీంతో మృతదేహాలను గుర్తించడం మరింత ఈజీ అవుతుందని అధికారులు భావిస్తున్నారు. సిస్మాలజి, జియాలజీ బృందాలతోనూ అన్వేషణ కొనసాగుతోంది. మొత్తం 150 మంది కార్మికులు నాలుగు బృందాలు షిఫ్టుల వైజ్‌గా పని చేస్తున్నారు.
టన్నెల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్ గుర్‌ప్రీత్ సింగ్ మృతదేహం ఆదివారం దొరికింది. అదే ప్రదేశంలో మరికొందరి ఆచూకీ దొరకవచ్చని అధికారులు భావిస్తున్నారు. అందుకే అక్కడే తవ్వకాలు కొనసాగిస్తున్నారు. టన్నెల్ పైకప్పు కూలిపోవడంతో ఇప్పుడా ప్రాంతమంతా రాళ్లు, మట్టి, టీబీఎం శకలాలతో నిండిపోయింది. అక్కడే, 12 ఏజెన్సీలు, నిపుణులు సహాయక చర్యలు చేపడుతున్నారు. టన్నెల్‌లో 13.85 కిలోమీటర్ల దగ్గర ప్రమాదం జరిగింది. దీంతో.. 11వ కిలో మీటర్ వరకు నీరు, బురద పేరుకుపోయాయి. దీంతో నిన్నా మొన్నటి దాకా 11వ కిలోమీటర్ వరకు మాత్రమే లోకో ట్రైన్ వెళ్లేది. అయితే.. పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి ప్రస్తుతం 13.20 కిలోమీటర్ల వరకు వెళ్లేలా లైన్ క్లియర్ చేశారు. ఇప్పుడు 13.20 కిలోమీటర్ల నుంచి 13.85 కిలోమీటర్ల మధ్య ముమ్మరంగా పనులు చేస్తున్నారు. సొరంగంలో నిమిషానికి 5 వేల లీటర్ల నీటి ఊట వస్తోంది. ఆ నీటిని తోడటానికి ప్రతి రెండున్నర కిలోమీటర్లకు ఒక పంపింగ్ యూనిట్ ఏర్పాటు చేశారు.
ఇప్పుడు రోబోలను కూడా రంగంలోకి దించడంతో.. అందరి ఆశలూ వాటిపైనే పెట్టుకున్నారు. మరోవైపు..రెస్క్యూ టీమ్స్ టార్గెట్ జీరోకు రీచ్ అవబోతున్నాయి. అయితే, కడవర్ డాగ్స్, రోబోల సాయంతో టన్నెల్‌లో చిక్కుకున్న వాళ్ల మృతదేహాలు వీలైనంత తొందరగా దొరుకుతాయని అంచనా వేస్తున్నారు.