తెలంగాణ రాష్ట్ర సాధనలో నిరుద్యోగుల పాత్ర క్రియాశీలకమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అయితే బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం చిత్తశుద్దితో తెలంగాణ యువత కలలు నెరవేర్చేందుకు కృషి చేస్తోందని వెల్లడించారు. రవీంద్రభారతిలో లెక్చరర్లకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… వివిధ ఆంశాల్ని ప్రస్తావించారు.
రేవంత్ రెడ్డి ప్రసంగం ముఖ్యాంశాలు
గత ప్రభుత్వం పదేళ్లు వృథా చేసిందని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 55163 ఉద్యోగాలను భర్తీ చేశామని సీఎం వివరించారు. తెలంగాణ ఉద్యమానికి పునాదిగా ఉన్న నిరుద్యోగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామన్న సంతృప్తి దక్కిందన్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది… దేశ ఆర్ధిక భవిష్యత్ విద్యాశాఖతో ముడిపడి ఉంది. అలాంటి శాఖలో మీరు ఉద్యోగ నియామక పత్రాలు అందుకోవడం గొప్పవిషయం. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల బదిలీలు, పదోన్నతుల సమస్యను పరిష్కరించి విద్యాశాఖను ప్రక్షాళన చేశామన్నారు.
విద్యా ప్రమాణాలు తగ్గిపోవడం ఆందోళన కలిగించే విషయం. ఇది తెలంగాణ రాష్ట్రానికి అవమానకరం.. అందుకే విద్య ప్రమాణాలు పెంచేందుకు ఉద్యోగ బాధ్యత నిర్వర్తించాలన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను తీర్చిదిద్దాలి. ప్రతీ ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది… ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఎక్కడ లోపం ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి…
విద్యార్థులపై ప్రభుత్వం పెట్టేది ఖర్చు కాదు.. అది రాష్ట్ర భవిష్యత్ కు పెట్టుబడి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతుందో మూలాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ స్కూళ్లలో విద్యాప్రమాణాలు పెంచేందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను నిర్మించబోతున్నాం. ఇటీవలే 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం రూ.11000 కోట్లు కేటాయించాం. విద్యార్థి, నిరుద్యోగుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం.
కెసీఆర్ మాకు వారసత్వంగా ఇచ్చింది అప్పులు, తప్పులు మాత్రమే. ప్రతీ నెలా రూ. 6500 కోట్లు కెసిఆర్ చేసిన అప్పులు తప్పులకే సరిపోతుంది. రాష్ట్రానికి కెసిఆర్ ఆర్థికంగా క్యాన్సర్ ఇచ్చారు. క్యాన్సర్ ముదురుతుంటే రాష్ట్రం దివాళా తీసిందంటారా అని అంటున్నారు. వాస్తవాన్ని ఎన్నాళ్ళు దాచిపెడతారు? నేను వాస్తవాలు చెబుతుంటే… దిగిపో దిగిపో అని మాట్లాడుతున్నారు. కెసీఆర్ కుటుంబం మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్ లా అబద్ధాలు మాట్లాడుతున్నారు. అబద్ధాల ప్రాతిపదికన నేను రాష్ట్రాన్ని నడపను.. వాస్తవాలు మీతో పంచుకుని రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తా. తెలంగాణలో భావితరాల భవిష్యత్ నిర్మాణానికి మీ సహకారం అవసరం.
అంతకు సిఎల్పి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…సభలో వ్యవహరించాల్సిన విధానంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండాలని, ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలని సీఎం హితబోద చేశారు.