ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు బడ్జెట్‌లలో ప్రజలను మోసం చేశారని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో తప్పుడు వాగ్దానాలు ఇచ్చారని, కరపత్రాలు కూడా పంచారని, కానీ.. బడ్జెట్‌లో ప్రజలకు ఇచ్చింది మాత్రం గుండు సున్నా అంటూ ఇటీవల ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై జగన్ విమర్శలు చేశారు. ప్రజలను చంద్రబాబు మోసం చేసిన తీరు ఈ బడ్జెట్లో ప్రస్పుటంగా కనిపిస్తోందన్నారు.
బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారని, కానీ.. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని వైఎస్ జగన్ విమర్శించారు. గవర్నర్ స్పీచ్‌లో కానీ, బడ్జెట్ ప్రసంగంలో కానీ.. ఎవరు మాట్లాడినా పర నింద.. ఆత్మ స్తుతి మినహా ఏమీ లేదన్నారు. ఈ రోజుకీ వాళ్ళ నోటి నుంచి జగన్ అట్లా… జగన్ ఇట్లా అని తప్పితే వాళ్లు ఇచ్చిన హామీల గురించి మాట్లాడటం లేదన్నారు.
చంద్రబాబు అండ్ టీమ్ ఏది చెప్పినా అబద్దం.. ఏది చేసినా మోసమే అన్నారు జగన్. చంద్రబాబు.. ఆయన దత్త పుత్రుడు కలిసి జగన్ చేసిన దానికంటే ఎక్కువ చేస్తున్నామని చెప్పి బ్రోచర్లు కూడా విడుదల చేశారని, కానీ, బడ్జెట్ లోనే వాళ్ల నిజ స్వరూపం బయట పడిందన్నారు వైఎస్ జగన్. మొదటి యేడాది కేటాయింపు అరకొర అది కూడా బడ్జెట్‌కే పరిమితమైందని.. ఇచ్చింది మాత్రం బోడిసున్నా అని విమర్శించారు. రెండో బడ్జెట్ కూడా అదే రీతిలో కనిపిస్తోందన్నారు.