29.4 C
Hyderabad
Tuesday, September 15, 2026

Live Video

spot_img

వేగంగా సాగుతున్న గిరిజన విశ్వవిద్యాలయ నిర్మాణం

విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలసలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి.వి.కట్టిమణి, డీన్ ప్రొఫెసర్ ఎం.శరత్ ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా వర్సిటీ నిర్మాణ పనుల ప్రగతిపై సీఎం సమీక్షించారు.

కేంద్ర ప్రభుత్వం ఈ వర్సిటీ కోసం రూ.800 కోట్లు కేటాయించగా, ఇప్పటికే రూ.340 కోట్లు విడుదలయ్యాయి.
మొత్తం 561 ఎకరాల్లో విశ్వవిద్యాలయం నిర్మాణం జరుగుతోంది. ఇందులో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, వసతి గృహాలు, అకడమిక్ బ్లాకులు నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాలను ఏడాదిలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. తాగునీటి సరఫరా, విద్యుత్ సదుపాయాలు, 2 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్డు పనులు తదితర వసతుల్ని తక్షణమే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం గిరిజన వర్సిటీలో కేవలం 18 మంది టీచింగ్ స్టాఫ్ మాత్రమే ఉన్నారని, 100 మంది అవసరం ఉందని అధికారులు వివరించారు. ఈ విషయం ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లేందుకు లేఖ రాస్తానని సీఎం చంద్రబాబు తెలిపారు.మే నెలలో జరుగనున్న స్నాతకోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు లేఖ పంపనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు.

2018లో, గత టీడీపీ హయాంలో ఈ గిరిజన వర్సిటీకి పునాది పడింది. అప్పటి నుంచి విద్యార్థులు అద్దె భవనాల్లో చదువుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పనులు మళ్లీ ఊపందుకున్నాయి. ప్రస్తుతం వర్సిటీలో 600 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో చదువుతున్నారు. భవనాలు పూర్తయితే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా. విద్యార్థులు ఉద్యోగావకాశాలు పొందేలా, నైపుణ్యాలను పెంచేలా బోధన ఉండాలని, ప్రస్తుత సమాజ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోర్సులు రూపొందించాలంటూ గిరిజన యూనివర్సిటీ అధికారులకు సీఎం చంద్రబాబు సూచనలు చేశారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com