ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం కేసులో విచారణకు సిట్ అధికారులు పంపిన నోటీసులకు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి స్పందించారు. మంగళవారం ఆయన సిట్ అధికారుల ముందు వ్యక్తిగతంగా హాజరవుతానని సమాచారం ఇచ్చారు. ఈమేరకు మీడియాకు ఒక ఆడియో రిలీజ్ చేశారు.
వాస్తవానికి లిక్కర్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆయన తరఫున దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. విచారణ సందర్భంగా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం.. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
అయితే, హైకోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం వస్తుందని ఆశించిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి.. మరో వారం ఆలస్యం అవుతుండటంతో సిట్ విచారణకు హాజరయ్యేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో, రేపు సిట్ ముందు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి హాజరవుతుండటంతో ఈ కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది.