29.4 C
Hyderabad
Tuesday, September 15, 2026

Live Video

spot_img

ఏపీలో స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్టు

ఆంధ్రప్రదేశ్‌లో వీధి వ్యాపారుల్లో మెరుగైన మార్పులు తీసుకు రావడానికి స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్టును వేగంగా అమలు చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. రోడ్లపక్కన తినుబండారాలు, చిన్న వస్తువులు విక్రయించే చిరు వ్యాపారులను మనం రోజూ చూస్తూనే ఉంటాం. అయితే, వీరి వల్ల కొన్నిసార్లు ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతుంటాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది.

ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ, వీధి వ్యాపారుల జీవనోపాధికి దెబ్బ తగలకుండా చూసేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. అదే భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్టును” ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది.

2013లో సుప్రీంకోర్టు ఆదేశాలతో నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ కింద ప్రారంభమైన ఈ ప్రాజెక్టు, పట్టణాల్లో రద్దీ నియంత్రణకు తోడ్పడటమే కాకుండా, వీధి వ్యాపారులకు పరిశుభ్రమైన వ్యాపార పద్ధతులను అలవాటు చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు కింద వీధి వ్యాపారులకు ప్రత్యేకంగా కంటైనర్ షాపులు నిర్మించి ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 కంటైనర్లను నిర్మించి, అర్హులైన చిరు వ్యాపారులకు కేటాయించనున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

ఇప్పటికే నెల్లూరులోని మైపాడు రోడ్డులో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ ప్రాజెక్టు విజయవంతమవుతోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లా కొత్త వంతెన రహదారిలో కంటైనర్ షాపుల నిర్మాణం ప్రారంభమైంది. ఈ కంటైనర్ దుకాణాల్లో వీధి వ్యాపారులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఉంటాయి. రూఫ్‌టాప్ సీలింగ్, సోలార్ విద్యుత్, ఉచిత వైఫై, ఆధునిక ఫర్నీచర్ వంటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

అంతేకాకుండా, ఆహార పదార్థాల తయారీ, మార్కెటింగ్‌పై ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు. కంటైనర్ దుకాణాల కేటాయింపు స్ట్రీట్ వెండర్స్ కమిటీ ఆధ్వర్యంలో, అర్హులైన అభ్యర్థులకు పారదర్శకంగా జరుగుతుంది. ఈ అవకాశాన్ని పొందాలంటే, అభ్యర్థి కనీసం 18 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. అలాగే స్థానిక సంస్థలో తమ వివరాలను నమోదు చేసుకుని ఉండాలి. ఒకే రకమైన ఆహార పదార్థాలు లేదా ఉత్పత్తులు విక్రయించేవారికి ఈ షాపులు కేటాయిస్తారు. ఇలాంటివి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడంతో, వీధి వ్యాపారులకు గౌరవప్రదమైన జీవనోపాధి కలగడమే కాక, పట్టణాల్లో రోడ్లపై ఏర్పడే రద్దీ కూడా తగ్గనుంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com