-
మేయర్‌పై నెగ్గిన అవిశ్వాసం
-
అవిశ్వాసానికి మద్దతుగా 74 ఓట్లు
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌ను అధికార కూటమి దక్కించుకుంది. జీవీఎంసీ మేయర్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో మేయర్ పీఠం కూటమి వశమయ్యింది. కొద్ది రోజులుగా గ్రేటర్ విశాఖను దక్కించుకునేందుకు కూటమి పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు సఫలమయ్యాయి. అవిశ్వాసానికి మద్దతుగా కార్పొరేటర్లతో పాటు.. ఎక్స్ అఫీషియో సభ్యులు మొత్తం 74 మంది ఓటేశారు. హాజరైన సభ్యలతో కోరం సరిపోవడంతో కలెక్టర్ జీవీఎంసీ ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో మేయర్ హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా.. హాజరైన 74 మంది మద్దతు తెలిపారు. దీంతో, అవిశ్వాసం నెగ్గింది. కూటమి పార్టీల కార్పొరేటర్లు ఆదివారం జీవీఎంసీ మేయర్‌ను ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు.. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. వైసీపీ కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశానికి హాజరు కావొద్దంటూ విప్ జారీచేసింది. అయినా వైసీపీ వ్యూహం ఫలించలేదు.
జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యింది. సభ్యుల లెక్కింపు తర్వాత అందరి సంతకాలు తీసుకొని ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. మేయర్ హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 74 మంది ఓటేశారు.