తమిళ హీరో, ప్రముఖ కార్ రేస్ అజిత్ కుమార్ కారు మరోసారి ప్రమాదానికి గురైంది. ఈసారి బెల్జియం రేసింగ్‌లో పాల్గొన్నప్పుడు ఈ యాక్సిడెంట్ జరిగింది. రేస్ జరుగుతుండగా కారు అదుపు తప్పి ట్రాక్ పక్కనే ఉన్న గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అజిత్ కారు ధ్వంసం కాగా.. అతను మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. ప్రస్తుతం బెల్జియంలో జరుగుతున్న సర్క్యూట్ డి స్పా-ఫ్రాంకోర్చాంప్స్ రేస్‌లో అజిత్ టీమ్ పాల్గొంటుంది.
ఇప్పుడే కాదు ఈ ఏడాది ఫిబ్రవరి 23న స్పెయిన్‌లో జరిగిన ఓ రేసింగ్ ఈవెంట్‌లో కూడా అజిత్ కారు తీవ్ర ప్రమాదానికి గురైంది. మరో కారును తప్పించే క్రమంలో ఆయన కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. అజిత్ ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అంతకుముందు జనవరిలో దుబాయ్ గ్రాండ్ ప్రీ రేస్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా కూడా అజిత్ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారు ట్రాక్ సమీపంలోని గోడను ఢీకొని ముందు భాగం దెబ్బతింది. ఈ ప్రమాదంలో అజిత్ గాయాలు లేకుండా బయటపడ్డారు. ఇక ఫిబ్రవరిలో పోర్చుగల్‌లో జరిగిన కారు రేస్ ట్రైనింగ్ తీసుకుంటుండగా.. అజిత్ కారు స్వల్ప ప్రమాదానికి గురైంది.
అజిత్‌కు సినిమాలంటే ఎంత ఇష్టమో.. బైక్, కార్ రేసింగ్ అంటే అంతకంటే ఇష్టం. అందుకే సినిమాలో ఎంత పేరు సంపాదించుకున్నా.. రేసింగ్‌ను మాత్రం వదలలేదు. 13 ఏళ్ల తర్వాతే ఆయన మళ్లీ రేసింగ్‌ను మొదలుపెట్టారు.