హైదరాబాద్‌కు పెరిగిన భారీ వలసలతో నగరం జనాభాతో కిక్కిరియిపోతోంది. భాగ్యనగరం నలుదిశలా వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి జీవనోపాధి కోసం వచ్చే వారు అధికంగా ఉన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, ఒడిశా, అస్సాం రాష్ట్రాల నుంచి వలసలు రెట్టింపు అయ్యాయి. తెలంగాణలో విద్యా, ఉపాధి పరంగా హైదరాబాద్ మినహా మరొక నగరంలో అవకాశాలు లేవు. దీంతో భాగ్యనగరానికి తమ భవిష్యత్తు పరీక్షించుకునేందుకు తెలంగాణ, ఏపీలోని గ్రామీణ ప్రాంతాల యువత చదువు పూర్తి కాగానే ఉపాధి కోసం తరలివస్తుంటారు.
ఈ క్రమంలో హైదరాబాద్ లో ఇంటి అద్దెలు ఆకాశన్నంటుతున్నాయి. ముఖ్యంగా ఇంటి అద్దె తడిసి మోపెడవుతోందని ఇక్కడకి వలస వచ్చిన వారు చెబుతున్నారు. వచ్చే జీతంలో సగం వరకు ఇంటి అద్దె చెల్లించడానికి సరిపోతుందని మధ్య తరగతి జీవులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ఇన్ఫో మెన్స్ ఆన్లైన్ మీడియా స్టార్ టాప్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ ఫామ్ ఓ సర్వే నిర్వహించింది. హైదరాబాదులో లివింగ్ కాస్ట్ ఎలా ఉంది? అనే దానిపై రీసెర్చ్ చేసి వివరాలను బయటపెట్టింది. ఈ పరిశోధనలో భాగంగా దేశవ్యాప్తంగా 10 ప్రధాన నగరాలను ఎంచుకుంది. ఇందులో ముంబైలో నెల జీతం 35, 887 రూపాయలతో మొదటి స్థానంలో ఉండగా.. జైపూర్ 27,813 రూపాయలతో చివరి స్థానంలో నిలిచింది. హైదరాబాదు ఆరవ స్థానం ఆక్రమించింది.
హైదరాబాదులో జీవించాలంటే నెలకు కనీసం 30 నుంచి 50 వేల వరకు ఖర్చు అవుతుందని ఈ సంస్థ తెలిపింది. ఇందులో ప్రధానంగా ప్రాథమిక సౌకర్యాలు కలిగిన అద్దె ఇంటికి రూ.8,000 చెల్లించాల్సిందే. ఇది కూడా సింగిల్ రూమ్ మాత్రమే. కాస్త ఫ్లెక్సిబుల్ రూమ్ కావాలంటే కనీసం 15 వేల వరకు అవుతుంది. కిరాణా ఖర్చులు, రవాణా ఖర్చులు, నిత్యవసరాలు, అదనపు ఖర్చులు కలిపి మొత్తం 31,000 అవుతుందని సంస్థ సర్వేలో బయటపడింది. పిల్లల స్కూల్ ఫీజులతోపాటు వైద్య ఖర్చులు అదనంగా భరించాల్సి వస్తుంది. ప్రస్తుతం సామాన్యులు వీటితోనే సతమతమవుతున్నారు.
సినిమాలు ఇతర విలాసాలు కావాలంటే మాత్రం ఈ ఖర్చుల్లో కొన్ని మాయం అవుతుంటాయి. ఎందుకంటే కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్లాలంటే కనీసం 1500 రూపాయల వరకు ఖర్చవుతుంది. సామాన్యులు నెలకు ఒక్కసారి సినిమాకు వెళ్లినా కనీసం రూ.2,000 వరకు వదిలించుకోవల్సిందే.ఇక పార్కులు, ఫంక్షన్ల లాంటి కార్యక్రమాలకు మరింత ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అయితే కొందరు వచ్చిన ఆదాయం సరిపోకపోవడంతో అదనంగా అప్పులు చేయాల్సి వస్తోంది.
వచ్చే జీతం సరిపోకపోవడంతో మధ్యతరగతి జీవులు బ్యాంకు రుణాలు తీసుకొని జీవితాన్ని గడుపుతున్నారు. దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాదులో అన్ని ధరలు పెరిగిపోయాయి. దీంతో సగటు మానవుడు హైదరాబాదులో జీవించాలంటే కనీసం రూ. 50వేల ఆదాయం వస్తూ ఉండాలి. కానీ చాలామందికి ఆ పరిస్థితి లేదు. ఒకవేళ అంత జీతం వచ్చినా పండుగలు, పేరంటాలు, అనారోగ్యాలు వస్తే దేవుడే దిక్కు అన్నట్టుగా మారింది.
ప్రముఖ ఆర్థిక వేత్త డ్యూసన్ బెర్రి చెప్పినట్టుగా ప్రదర్శన ప్రభావం(demonstration effect) మధ్యతరగతిపై అధికంగా ఉంది. ధనవంతుల అలవాట్లు, పోలికలతో మధ్యతరగతి ప్రజలు ఆడంబరాలకు పోవడంతో ఖర్చులు పెరిగాయని డ్యూసన్ బెర్రి వందల ఏళ్ల క్రితం చెప్పాడు. ఖర్చులు తగ్గించుకుని, పొదుపు చేస్తేనే ఆదాయం సరిపోయే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు.