జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు కలకలం సృష్టించారు. పహెల్‌గామ్ లోని బైసరన్ వ్యాలీలో కశ్మీర్ అందాలను చూసేందుకు వచ్చిన టూరిస్టులను టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇప్పటికే ఒకరు మృతి చెందగా.. ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. టూరిస్టులపై విచక్షణరహితంగా కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి అడవుల్లోకి పారిపోయారు. కాల్పులు తర్వాత అక్కడి పరిస్థితులు భయానకంగా మారాయి.
ఉగ్రవాదులు దాడి చేసిన బైసరన్ వ్యాలీ అనే ఏరియాకు ఎలాంటి రోడ్డు మార్గం లేదు. అందుకే ఈ ప్రాంతాన్ని ఉగ్రవాదులు ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. కాల్పుల ఘటన తెలుసుకున్న వెంటనే భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ముందుగా గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించాయి. పహెల్‌గామ్‌లో అదనపు బలగాలను మోహరించారు. ఈ అమానుష ఘటనకు పాల్పడింది తామే అంటూ ప్రకటించుకుంది.. లష్కరే తొయిబా అనుబంధ సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్.
ప్రస్తుతం పహెల్‌గామ్ ఏరియాలో కూంబింగ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేశాయి. హైఅలర్ట్ ప్రకటించి.. ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా జల్లెడ పడుతున్నాయి. లష్కరే తొయిబా అనుబంధ సంస్థ అయిన ద రెసిస్టెన్స్ ఫోర్స్ కశ్మీర్‌లో వరుసగా దాడులు చేస్తోంది.