39.2 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

ఓల్డ్ సిటీలో మెట్రో రైలు విస్తరణ జోరు

1100కు పైగా ప్రైవేట్ ఆస్తులపై ప్రభావం

రూ.212 కోట్లు నష్టపరిహారంగా చెల్లింపు

హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రారంభమైనప్పటి నుంచి నగర ట్రాఫిక్ పరిస్థితులు, రవాణా సౌలభ్యం, ఆర్థికాభివృద్ధి పూర్తిగా మారిపోయాయి. మెట్రో ఉన్న ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ విలువలు పెరగడం, వాణిజ్య కార్యకలాపాలు వృద్ధి చెందడం కనిపిస్తుంది. కానీ, ఇన్నాళ్లుగా అసలు మెట్రో చూస్తామా? అనే ఓల్డ్‌ సిటీ వాసుల సందేహాలు నివృత్తి అవుతున్నాయి. ఓల్డ్‌ సిటీ మెట్రో ప్రాజెక్ట్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నూమా వరకు 7.5 కిలోమీటర్ల మేర మార్గంలో స్వల్ప మార్పులతో మెట్రో నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. ఈ మార్గంలో ఎంజీబీఎస్, సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్‌ నుమా స్టేషన్ల ద్వారా మెట్రో రైలు మార్గం చంద్రాయణగుట్ట వరకు సిద్ధమవుతోంది.

ఈ ప్రాజెక్ట్‌లో 1100కు పైగా ప్రైవేట్ ఆస్తులపై ప్రభావం పడనుంది. ఇప్పటివరకు 205 ఆస్తులకు సంబంధించి నష్టపరిహారం చెల్లింపు పూర్తయ్యింది. భూములు, నిర్మాణాలు కోల్పోతున్న కుటుంబాలకు మొత్తం రూ.212 కోట్లు పరిహారంగా ప్రభుత్వం చెల్లించింది. అయితే, మెట్రో మార్గంలో ఉన్న మిగిలిన ఆస్తుల యజమానులలో చాలా తక్కువమంది మాత్రమే స్వచ్ఛందంగా సహకరిస్తున్నారని అంటున్నారు. మిగిలిన వారిని ఒప్పించడం, వారి భావోద్వేగాలను తగిన రీతిలో సమీక్షించడం అధికారులకు పెద్ద సవాల్‌గా మారుతోందంటున్నారు.

ఇక, పాతబస్తీలోని చారిత్రక కట్టడాలు, ప్రార్థనా స్థలాలు మతపరమైన సెంటిమెంట్లతో ముడి పడి ఉన్నందున ఈ రూట్‌లో మధ్యలో ఉన్న నిర్మాణాల తొలగింపులో అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీస్, రెవెన్యూ, మెట్రో ఇంజనీరింగ్ బృందాల సమన్వయంతో సురక్షితంగా ఈ పనులు నిర్వహిస్తున్నారు. విద్యుత్, టెలిఫోన్ లైన్లను తొలగించి మార్గాన్ని క్లియర్ చేయడం ఇప్పటికే ప్రారంభమైంది.

మెట్రో పూర్తయితే ఓల్డ్ సిటీకి కొత్త కళ రానుంది. ప్రధానంగా ట్రాఫిక్ జామ్‌ నుంచి విముక్తి లభించడంతో పాటు.. పర్యాటక అభివృద్ధి, చిన్న వ్యాపారాలకు ప్రోత్సాహం అందే పరిస్థితులు ఉన్నాయి. టూరిజం పెరగడం ద్వారా చార్మినార్, సాలార్‌జంగ్‌ మ్యూజియం లాంటి ప్రదేశాలకు రాకపోకలు కూడా మెరుగవుతాయి.

ప్రభుత్వం స్థానికులను మెట్రో నిర్మాణంలో భాగస్వాములుగా చేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. భూసేకరణ సమస్యలు అధిగమించి మెట్రో నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయడం ద్వారా ఓల్డ్ సిటీ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com