39.2 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

వేసవి సెలవుల్లోనూ ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం నూతన ప్రణాళికలు రూపొందించింది. వేసవి సెలవుల్లోనే ముందస్తుగా ‘బడిబాట’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు, ఉపాధ్యాయులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా పై అధికారుల అనుమతితో అడ్మిషన్లు ప్రారంభించి ఇంటింటికీ తిరుగుతున్నారు.

బడిబాట కార్యక్రమం గతంలో జూన్ 12వ తేదీ నుంచి ప్రారంభించేవారు. గత యేడాది జూన్ 6 వ తేదీన ప్రారంభించగా, ఈసారి మాత్రం ఏప్రిల్ రెండో వారం నుంచే అధికారులు అధికారికంగా కాకపోయినా.. ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు గ్రామ గ్రామానా తిరుగుతూ తమ పాఠశాలల్లో అడ్మిషన్లు చేసుకుంటుండటంతో, వారికి పోటీగా ప్రభుత్వ టీచర్లు కూడా సర్కారు బళ్లలో ప్రయోజనాలను వివరించేందుకు ఇంటింటికీ తిరుగుతున్నారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

తల్లిదండ్రులకు ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల భారం గురించి వివరిస్తూ, సర్కారీ స్కూళ్లలో ఉచితంగా నాణ్యమైన విద్య అందించడంతో పాటు.. ఉచితంగా పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫారమ్‌లు కూడా అందిస్తున్నామని చెబుతున్నారు. అలాగే, సమయానుకూలంగా ఉచిత ఆరోగ్య పరీక్షలు, ఉదయాన్నే రాగి జావ, మధ్యాహ్నం ఉచిత భోజనం, డిజిటల్ తరగతులు, ఇంగ్లీష్ మీడియం విద్య అందుబాటులోకి తెచ్చినట్లు పిల్లల తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. సొంత భవనాలు, అర్హత కలిగిన ఉపాధ్యాయులు, ఆట స్థలాలు వంటి సౌకర్యాలపైనా స్పెషల్‌గా ఫోకస్‌ పెడుతూ పేరెంట్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

గత కొన్నేళ్లుగా విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. 2014-15 విద్యా సంవత్సరంలో 24.85 లక్షల మంది విద్యార్థులు ఉండగా, 2024-25 నాటికి ఆ సంఖ్య 16.86 లక్షలకు పడిపోయింది. కేవలం 2023-24తో పోలిస్తే 2.63 లక్షల మంది విద్యార్థులు తగ్గారు. వీరిలో ప్రాథమిక పాఠశాలల్లో 1.21 లక్షలు, ప్రాథమికోన్నత స్థాయిలో 64,830 మంది, ఉన్నత పాఠశాలల స్థాయిలో 76,564 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటులో చేరారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో, ఇప్పుడు ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ కమిటీలతో కలిసి తల్లిదండ్రులను మరియు పిల్లలను చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సర్కారీ బడుల్లో చదువుకున్నవారు జీవితంలో ఎలా ఎదిగారో వారి చరిత్రను కూడా పరిచయం చేస్తున్నారు. చదువుకు దూరమైన పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్చే యత్నాలు జరుగుతున్నాయి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com