పర్సెంటేజీలు, ర్యాంకుల మాయలో పడ్డ విద్యావ్యవస్థలో సామాజిక స్పృహకు స్థానం లేకుండా పోతోంది. విద్యాబుద్దులు నేర్పే గురువు పట్ల సభ్య సమాజం తలదించుకునేలా ఓ విద్యార్థిని వ్యవహరించింది. విశాఖపట్నం-విజయనగరం జాతీయ రహదారి సమీపంలోని దాకమ్మరి వద్ద జరిగిన ఈ ఘటన సమాజాన్ని నివ్వెరపరిచేలా చేసింది.
కళాశాల క్యాంపస్ లో ఫోన్ కాల్స్ మాట్లాడవద్దంటూ సెల్ ఫోను తీసుకున్న అధ్యాపకురాలిపై ఓ విద్యార్థిని చెప్పుతో దాడికి పాల్పడింది. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలంలోని రఘు ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ లో జరిగిన ఈ ఘటన…సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఫోన్ లో మాట్లాడుతుండగా..ఎన్సీసీకి చెందిన అధ్యాపకురాలు ఫోన్ లాక్కున్నారు. ఆగ్రహించిన విద్యార్థిని 12వేల విలువైన సెల్ ఫోన్ తీసుకుంటావా అంటూ తిట్ల దండకం ప్రారంభించింది. చెప్పు తీసి కొడతానంటూ కేకలు వేసింది. ఆ తర్వాత అనుకున్నంత పని చేయడంతో..అక్కడున్న విద్యార్థులు, సిబ్బంది అవాక్కయ్యారు.
వీడియోలో విద్యార్థిని ఆవేశం పరిశీలిస్తే మానసికంగా ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోంది. క్షణికావేశంలో విద్యార్థిని చేసిన తప్పిదం కళాశాల, తల్లిదండ్రులను తలవంపుల పాలు చేశాయని స్థానికులు వాపోతున్నారు.