-
అమెరికాలో భారీగా ఉద్యోగాలు ఫట్
ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారనేది నానుది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక అనుసరిస్తున్న వైఖరి, తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే.. ఈ నానుడి అగ్రదేశానికి సరిగ్గా సరిపోయేలా ఉందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ప్రపంచంలో అమెరికాను నంబర్ వన్‌గా నిలపాలనే ప్రయత్నంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఓ రకంగా బూమరాంగ్ అవుతున్నాయట. ఆ దేశంలోని ప్రజలు, ఉద్యోగులు, కంపెనీలకే ముప్పుగా మారుతున్నాయని చెబుతున్నారు. ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలు ప్రపంచ వాణిజ్య వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఆటోమోటివ్, భారీ వాహన తయారీ రంగాలను అనిశ్చితిలోకి నెట్టాయి. ఈ సమయంలో, స్వీడన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ వోల్వో గ్రూప్ అమెరికాలోని తన మూడు కంపెనీల్లో 550 నుంచి 800 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. మార్కెట్ అనిశ్చితి, ట్రక్కుల డిమాండ్ తగ్గుదల, సుంకాల వల్ల పెరిగిన ఉత్పత్తి ఖర్చులు ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.
వోల్వో గ్రూప్ చేపడుతున్న ఈ జాబ్ కట్స్ అమెరికాలోని మూడు కీలక కర్మాగారాలను ప్రభావితం చేయనున్నాయి. పెన్సిల్వేనియా, మకుంగీలోని మాక్ ట్రక్స్ ప్లాంట్, వర్జీనియా, డబ్లిన్ లోని వోల్వో సంస్థ తయారీ యూనిట్, మేరీల్యాండ్, హేగర్స్‌టన్‌లో ఉన్న వోల్వో మరో తయారీ సైట్‌లపై ఈ ప్రభావం బాగా పడుతోంది. ఈ పరిశ్రమలు హెవీ డ్యూటీ ట్రక్కులు, వాటికి సంబంధించిన ఆటోమోటివ్ ఉత్పత్తుల ప్రొడక్షన్‌లో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, ట్రంప్ విధించిన సుంకాల వల్ల పెరిగిన ముడి పదార్థాల ధరలు , తగ్గిన ఫ్రైట్ డిమాండ్ ఈ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయట. ఉక్కు, అల్యూమినియం వంటి ముడి పదార్థాలపై అధిక సుంకాలు వోల్వో వంటి సంస్థలకు తయారీ ఖర్చులను పెంచాయి. వీటికి తోడు.. సరుకు రవాణా రంగంలో డిమాండ్ తగ్గడం, ఆర్థిక అనిశ్చితి, సంభావ్య నియంత్రణ మార్పులు కంపెనీలను కఠిన నిర్ణయాలు తీసుకునేలా ఒత్తిడి చేస్తున్నాయి.
అమెరికా ట్రక్కింగ్ పరిశ్రమ ఇటీవలి సంవత్సరాల్లో సవాళ్లను ఎదుర్కొంటోంది. ఫ్రైట్ రేట్లలో అస్థిరత, డిమాండ్ తగ్గుదల, సుంకాలతో పెరిగిన ఖర్చులు ఈ రంగంలోని సంస్థలను ఒత్తిడిలోకి నెట్టాయి. వోల్వో వంటి కంపెనీలు, ఉత్తర అమెరికాలో సుమారు 20 వేల మంది కార్మికులతో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. కానీ, మార్కెట్ బలహీనత వల్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. పరిశ్రమల విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ సుంకాలు దీర్ఘకాలంలో ఆటోమోటివ్ రంగంలో ఆవిష్కరణలపై, పెట్టుబడులపైనా ప్రభావం చూపిస్తాయంటున్నారు.
వోల్వో గ్రూప్ ఉద్యోగాల కోతలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇంకా వెల్లడించకున్నా.. దీంతో ఎఫెక్ట్ అయ్యే కార్మికులకు సెవరెన్స్ ప్యాకేజీలు, ఇతర ఆర్థిక సహాయం అందించేందుకు ముందుగా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వోల్వో కంపెనీ కార్మికులపై ప్రభావాన్ని తగ్గించే విధంగా ఇలాంటి కఠిన నిర్ణయాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని అంటున్నారు. అయినప్పటికీ, ఈ తొలగింపులు స్థానిక ఆర్థిక వ్యవస్థలపై, ముఖ్యంగా పెన్సిల్వేనియా, వర్జీనియా, మేరీల్యాండ్‌పైనా ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ సుంకాలు కేవలం వోల్వో గ్రూప్‌ను మాత్రమే కాకుండా, ఇతర అంతర్జాతీయ సంస్థలను కూడా ఒత్తిడిలోకి నెట్టాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఇతర తయారీ సంస్థలు కూడా ఉత్పత్తి తగ్గింపు లేదా ఉద్యోగ కోతల వంటి చర్యలకు పాల్పడవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.