ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం తెలుగు భాష అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ఏపీలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. విజయవాడలో జరుగుతున్న 6వ ప్రపంచ తెలుగు రచయితల మహా సభల్లో జస్టిస్ ఎన్వీరమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించారు. గత ప్రభుత్వం తెలుగు భాషను అణచివేసేలా ఇచ్చిన జివో 85ను రద్దు చేయాలన్నారు. సుప్రీంకోర్టులో ఉన్న ఈ కేసుపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. తెలుగు భాష ప్రాధికారిక సంస్థను మళ్లీ పునరుద్ధరించాలన్నారు. ఈ మహాసభల ద్వారా కవులు, రచయితలకు ప్రోత్సాహం అందించాలని.. భాషాభివృద్ధి కోసం పని చేసేలా వారిని ప్రోత్సహించాలని సూచించారు. ప్రజాబాహుళ్యంలో మాతృభాషలోనే నిర్ణయాలన్నీ ఉండాలని ఎన్డీ రమణ ఆకాంక్షించారు. ప్రభుత్వాలు కూడా తెలుగు భాషలోనే ఆదేశాల కాపీలు ఇచ్చే ఆలోచన చేయాలన్నారు. తెలుగు భాష వైభవం వల్లే తెలుగు రాష్ట్రాలకు కీర్తి ఉంటుందని, మన ఆచార, వ్యవహారాలు సక్రమంగా అమలు చేయాలని, అభివృద్ధితో పాటు భాషా సంస్కృతిని అలవాటు చేసుకోవాలని జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు.
తెలుగు జాతి అంటే మదరాసీలు కాదని తెలుగు రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణాలు విడిచారన్నారు. తెలుగు భాష పరిరక్షణ కోసం రామోజీరావు ఎంతో కృషి చేశారని చెప్పుకొచ్చారు. వంద బిలియన్లు మన తెలుగు భాషను మాట్లాడుతుంటారని.. తెలుగు ఉనికి అతి ప్రాచీన భాషగా గుర్తింపు పొందిందన్నారు. పురాణాలు, ఇతిహాసాలు దాటి ప్రజల భాషగా తెలుగు భాష మారిందన్నారు. సంగీతం తరహాలో అందమైన భాష తెలుగు భాష అని కొనియాడారు. వ్యాపార, రాజకీయ ప్రయోజనాలతో తెలుగు భాషను అణగదొక్కారని విమర్శించారు. తగినంత గుర్తింపు కూడా భాషకు దక్కలేదన్నారు. వాడుక భాషలో మనం ఇంకా ప్రజలకు దగ్గర కాలేదని.. తెలుగు భాష వృద్ధిపై మన ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
కొన్ని దేశాల్లో వారి మాతృభాషలో విద్యాబోధన చేసి అద్భుతాలు సాధించారని జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు. వారి సాంకేతికతను, విజయాలను వారి భాషలోనే రాసుకున్నాయన్నారు. భవిష్యత్తుతరాలకు మాతృభాషపై ఒక గౌరవం కలిగించాయన్నారు. ఆ తరహాలో మన తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. మాతృభాషలో విద్యను అభ్యసించి చాలా మంది ఉన్నత స్థితికి చేరారని, పెట్టుబడిదారులు ఇంగ్లీషు భాష ఉంటేనే ఉద్యోగాలు అని అందరినీ తప్పుదారి పట్టించారన్నారు. తెలుగు భాషలోచదివి దేశ విదేశాల్లో రాణిస్తున్న వారు ఎందరో ఉన్నారని గుర్తుచేశారు.