38.2 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

కాంగ్రెస్ లో స్మారక చిహ్నాల ప్రహసనం

  • కాంగ్రెస్ కి ఇది ఆనవాయితీయా?
  • అగ్రనేతలపై కినుక..లాయల్టీకే ఓటా?

కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం సోనియా గాంధీ, ఆమె కుటుంబమేనా? మూడోసారి ఎన్నికల్లో విజయం పొందడానికి నరేంద్రమోడీ ఎక్కుపెట్టిన బాణం వారసత్వ పాలన..ఇది ఘాటుగా పనిచేసిందో లేదో తెలీదు కానీ కాంగ్రెస్ మాత్రం కేంద్రంలో పట్టు సాధించలేకపోతోంది. కాంగ్రెస్ పై ఇలాంటి కీలక సందర్భాల్లో విమర్శల దుమారం రేగుతుంటుంది. గాంధీ కుటుంబం, విశ్వాస పాత్రులకు తప్ప మరోకరికి గుర్తింపు లేదన్న విపక్షాల విమర్శలకు అనుగుణంగానే అక్కడ రాజకీయాలు జరుగుతుంటాయి. అవి అన్యాపదేశంగా జరిగినవా? లేక అవగాహనతో జరిగినవా? సమన్వయ లోపంతో జరిగినవా అన్నది బయటకు తేలదు కానీ ఇది కాంగ్రెస్ పార్టీకి మరోసారి తగిలిన పెద్ద దెబ్బ.. దేశ ఖ్యాతిని ఇనుమడింప చేసిన నేతలు ఎంత పెద్ద వారైనా వీర విధేయులను తప్పితే మిగతా వారిని పట్టించుకోదన్న విమర్శలున్నాయి. గాంధీయేతర నేతను ఆ పార్టీలో ఎదగనివ్వరని, ఎదిగినా వారికి తగిన గౌరవం దక్కదన్న విమర్శలు మన్మోహన్ మరణంతో మరోసారి చర్చకు వచ్చాయి. గతంలో పీవి నరసింహారావు చనిపోయినప్పుడు ఇలాంటి దుమారమే రేగింది..

అప్పుడేం జరిగింది?

పీవీకి సోనియా గాంధీ కుటుంబానికి అంత సఖ్యత లేదన్నది బయట సాధారణంగా వినిపించే టాక్. మేధావులను, స్వతంత్రంగా ఎదిగేవారిని సోనియా ప్రోత్సహించరని, తన ఇమేజ్ కు మించి ఎవరు ఎదిగినా.. పార్టీలో తొక్కేస్తారని విపక్షాలు ఎప్పుడూ విమర్శిస్తుంటాయి. గాంధీయేతర ప్రముఖులు అక్కడ గుర్తింపు పొందలేరన్నది చాలా మంది చేసే విమర్శ. మాజీ ప్రధాని పీ.వీ. మరణించినప్పడు ఆయన పార్ధివ దేహాన్ని ఏఐసిసి కార్యాలయంలోకి అనుమతించలేదు. బయటకి ఏ కారణాలు వెల్లడించనప్పటికీ ఆయన పార్ధివ దేహాన్ని కార్యాలయం బయట కొద్దిసేపు నిలిపి అనంతరం హైదరాబాద్ తరలించేశారు. అప్పట్లో ఇది తీవ్రమైన విమర్శలకు కారణమైంది. పీవీని అవమానించారని, మహనీయులను గుర్తించి, గౌరవించడం కాంగ్రెస్ సంసంస్కృతి కాదని చాలా మంది తలెత్తుకోలేనన్ని విమర్శలు చేశారు. మరణానంతరం పీవీకి కనీసం ఒక స్మారక చిహ్నమైనా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు వచ్చినా కాంగ్రెస్ వాటిని సీరియస్ గా పరిగణించలేదు. యూపీఏ దశాబ్దం పాటు అధికారంలో ఉన్నా.. పార్టీ ప్రతిష్టను ఇనుమడింప చేసే ఒక్క కార్యక్రమమైనా చేపట్టలేదు. దక్షిణాది వారంటే పార్టీలో గుర్తింపు లేదన్న విమర్శలు అప్పట్లో రేగాయి.

ప్రణబ్ ముఖర్జీ పైనా అదే ధోరణి..

మరణించిన ప్రముఖులకు సంతాప సమావేశాలు పెట్టి తీర్మానం చేయడం ఏ పార్టీ అయినా ఆనవాయితీగా చేసేదే. పీవీ టైం లో జరిగినతప్పునైనా కాలక్రమంలో సరిదిద్దుకోవాలిగా.. కాంగ్రెస్ తీరే అంత అని తాజాగా ప్రణబ్ ముఖర్జీ కుమార్తె సుస్మిత చేసిన ఆరోపణలు బలపరుస్తున్నాయి.కాంగ్రెస్ పార్టీకి చిరకాలం సేవ చేసిన ప్రణబ్ అనేక కీలక పదవుల్లో కొనసాగారు. రాష్ట్రపతిగా కూడా రాణించి చివరకు కన్నుమూశారు. మాజీ నేత మరణించినప్పడు ఆయన పార్టీకి చేసిన సేవలను స్మరించుకుంటూ సంతాప తీర్మానం చేయాలి. కానీ అప్పుడూ పార్టీ వదిలేసింది. అప్పట్లో రాష్ట్రపతులకు సంతాప తీర్మానం పెట్టడం పార్టీ రాజ్యాంగంలో లేదని అప్పట్లో ఓ నేత సుస్మితతో అన్నారట. కానీ ఆ తర్వాత తన తండ్రి డైరీలు చదివితే అది బుకాయింపు మాత్రమేనని అర్ధమైందన్నారు. కాంగ్రెస్ పార్టీకే చెందిన కే.ఆర్. నారాయణన్ కూడా రాష్ట్రపతిగా చేశారు. ఆయన మరణించినప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సంతాప సమావేశం ఏర్పాటు చేసింది. అప్పటి సీడబ్ల్యుసీ అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ స్వయంగా సంతాప తీర్మానాన్ని డ్రాఫ్ట్ చేశారని ఆయన డైరీలు చెబుతున్నాయి.

మన్మోహన్ విషయంలో..

ఇప్పుడు మన్మోహన్ సింగ్ వ్యవహారం. మాజీ ప్రధాని సోనియాకు అత్యంత వీర విధేయుడైన వ్యక్తి.. దాంతో ఆయన ఇమేజ్ ని పార్టీకి ఆపాదించుకుని లబ్ది పొందాలన్నది కాంగ్రెస్ ఎత్తుగడ. నిజానికి మన్మోహన్ రాజకీయ నేత కాదు.. ఆయన అందరూ అన్నట్లు ఓ విధంగా యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టరే అనుకోవాలి. కానీ మంచి అడ్మినిస్ట్రేటర్ గా, పాలసీ మేకర్ గా తనకున్న పరిజ్ఞానంతో కాంగ్రెస్ కు రెండుసార్లు అధికారం దక్కేలా చేశారు. పదేళ్ల యూపీఏ పాలనకు ఓ గుర్తింపుని తెచ్చిన వ్యక్తి. వివాదాలెలా ఉన్నా.. అవినీతి ఆరోపణలెలా ఉన్నా.. మన్మోహన్ చేసిన కొన్ని చట్టాలు ఆ తర్వాత కాంగ్రెస్ పదే పదే తమ ఆస్తిగా ప్రచారం చేసుకుంది. ఇప్పుడు ఆయన మరణానంతరం ఆయన వ్యక్తిత్వానికి, ప్రతిష్టకు ఉన్న గుర్తింపును తమ పార్టీ క్రెడిట్స్ లోకి చేర్చుకోవాలని చూస్తోందా?

లాయల్టీకే పెద్దపీటా?

పీవీకి తమ ఏలుబడిలో స్మారక చిహ్నం నిర్మించని కాంగ్రెస్ ఇప్పుడు మన్మోహన్ కు స్మారక చిహ్న కోసం యాగీ చేస్తోంది. అందుకే ప్రతిపక్షాలకు లోకువై పోయింది. పైగా కాంగ్రెస్ గత నిర్వాకాలకు సాక్ష్యాలు కూడా బయట పడుతున్నాయి. ఇవన్నీ అందరూ చేసే ఆరోపణలకు బలాన్నిస్తున్నాయి. తమ చాణుక్య నీతికి, మేధావితనానికి, పరిపూర్ణ వ్యక్తిత్వానికి, సునిశిత రాజకీయ మేధావి తనానికి పేరు పడిన నేతలకు కాంగ్రెస్ లో గుర్తింపు ఉండదా? కేవలం లాయల్టీ ఆధారంగానే నేతలకు గుర్తింపు ఇస్తారా?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com