కాంగ్రెస్ కి అనుకోని ఎదురుదెబ్బలు
దివంగత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మెమోరియల్ నిర్మాణం పై అంత్యక్రియలు పూర్తవకుండానే దుమారం రేగుతోంది. ఆయనను క్లెయిమ్ చేసుకునే విషయంలో రాజకీయ పార్టీలు చేసుకుంటున్న దూకుడు విమర్శలు సంచలనం గా మారాయి. మన్మోహన్ కు మెమోరియల్ నిర్మించాలన్న ప్రతిపాదనను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోడీ ద్రుష్టికి ముందు తీసుకొచ్చారు. అంత్యక్రియలు జరిగిన ప్రదేశంలోనే స్మారక చిహ్నం కట్టాలనే ప్రతిపాదనను పరిశీలించాలని కోరారు. మహనీయుల మరణానంతరం వారికి అంత్యక్రియలు జరిగిన చోటే స్మారక చిహ్నం కట్టే ఆనవాయితీ ఉందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే దీనికి హోం మంత్రి అమిత్ షా స్పందించారు. మన్మోహన్ కు స్మారక చిహ్న కట్టే విషయమై తమ ప్రభుత్వం ఆలోచనలో ఉందని అయితే అంత్యక్రియలకు దీనికి సంబంధం లేదని, ముందు అంత్యక్రియలు జరగాలని అన్నారు. ఇది కాంగ్రెస్, బీజేపి నేతల మధ్య వివాదానికి కారణమైంది. స్మారక చిహ్న నిర్మాణానికి సరైన స్థలం కోసం ఇంకా అన్వేషణలో పడటం రాజకీయమేనని, కనీసం దానిపై ఒక ప్రకటన చేసేందుకు కూడా బీజేపి ప్రయత్నించడం లేదని ఇది తొలి సిక్కు ప్రధాని సేవలను అవమానించడమేనని కాంగ్రెస్ సీనియర్ నేత జై రామ్ రమేష్ ఘాటుగా రియాక్టయ్యారు.జైరామ్ కామెంట్లపై హోం మంత్రి ఘాటుగా స్పందించారు.
మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు కు మరణానంతరం కాంగ్రెస్ చేసిన అవమానాలను ఒకసారి గుర్తుచేసుకోవాలని ఇలాంటి చెత్త రాజకీయాలు చేయడం మానుకోవాలని రిప్లయ్ ఇచ్చారు. మాజీ ప్రధాని పీవీ మరణించినప్పుడు ఆయన పార్ధివ దేహాన్ని ఏఐసీసీ కార్యాలయంలోకి కూడా కాంగ్రెస్ అనుమతించలేదు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఈ విమర్శలపై తేరుకునే లోపే కాంగ్రెస్ కు మరో పంచ్ తగిలింది. అది మరో కాంగ్రెస్ నేత కుమార్తె నుంచి.
నా తండ్రికి కూడా అలాగే..
మరోవైపు మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత, అనేక హోదాల్లో సేవ చేసిన ప్రణబ్ ముఖర్జీ విషయంలోకూడా కాంగ్రెస్ వైఖరి ఇలాగే ఉందని ఆయన కుమార్తె ట్విటర్ వేదికగా ఘాటు కౌంటర్ ఇచ్చారు. దీంతో సొంత పార్టీ నుంచే ఎదురు దెబ్బ తగలడంతో కాంగ్రెస్ డిఫెన్స్ లో పడిపోయింది. ప్రముఖుల మరణానంతరం ఇలా విగ్రహ రాజకీయాలు, వివాదాలు రేగడం మామూలుగా మారింది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ప్రముఖులందరికీ విగ్రహాల ఏర్పాట్లు, దానికి అట్టహాసంగా ఆవిష్కరణలు జరుగుతున్నాయి.
వ్రుద్ధాప్య సమస్యలతో నిన్న మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్ కు పూర్తి అధికార లాంఛనాలతో ఢిల్లీలోని నిగమ్ బోధ్ లో అంత్యక్రియలు చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. నిగమ్ బోధ్ లో పలువురి స్మారక చిహ్నాలు ఉండటం వల్ల అదే ప్రదేశంలో ఆయనకు స్మారక చిహ్నం నిర్మించాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది.