28.2 C
Hyderabad
Friday, August 14, 2026

Live Video

spot_img

తెలంగాణ తల్లి విగ్రహం…. పాలిటిక్స్

తెలంగాణ తల్లి.. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ మొత్తం ఈ విగ్రహం చుట్టే తిరుగుతోంది. విగ్రహం ఏర్పాటు మంచిదే అయినా.. ఏర్పాటు చేసిన చోటు.. ఆ విగ్రహం రూపు పైనే ఇప్పుడు వివాదం జరుగుతోంది. విగ్రహం ఏర్పాటు.. దాని డిజైన్ వెనక పెద్ద కథే ఉంది.

తెలంగాణకు నూతన సెక్రటేరియట్ నిర్మించే సమయంలోనే సెక్రటేరియేట్ ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అప్పటి సీఎం కేసీఆర్. కానీ ఆయన అనుకున్నట్టుగా జరగలేదు. ఎన్నికలు వచ్చాయి. బీఆర్ఎస్ ఓడింది. ఆయన మకాం ప్రగతి భవన్ నుంచి ఫామ్‌హౌజ్‌కు మారింది. ఇక కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలనుకన్న చోటునే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు. అదిగో అక్కడ మొదలైంది అసలు వివాదం.

తెలంగాణ తల్లి ఉండాల్సిన చోట.. అసలు తెలంగాణకు ఏ సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు అని బీఆర్ఎస్‌ నుంచి ప్రశ్నలు మొదలయ్యాయి. స్వామి భక్తి చూపించాలనుకుంటే గాంధీ భవన్‌లో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి కానీ.. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసే చోట ఎందుకని ప్రశ్నించింది. అఫ్‌కోర్స్ ప్రజల్లో కూడా ఈ చర్చ మొదలైంది. కానీ రేవంత్ రెడ్డి అస్సలు వెనక్కి తగ్గలేదు. అక్కడే రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. అయితే ఈ ఇష్యూ ప్రజల్లోకి వ్యతిరేకంగా వెళ్తుండటంతో కొత్త స్ట్రాటజీతో ముందుకు వచ్చింది కాంగ్రెస్. తెలంగాణ తల్లి అంటే మాకు ఎంతో గౌరవం.. మీలా అలా రోడ్డుపై కాకుండా ఏకంగా సెక్రటేరియట్‌లోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. స్థలం చూశారు. పనులు ప్రారంభించారు. అయితే ఇక్కడ మరో లాజిక్ ఉంది. ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. సెక్రటేరియట్ బాహుబలి గేట్‌ను చాలా రోజులుగా రేవంత్ ఉపయోగించడం లేదు. వేరే గేట్ల నుంచే వెళ్లడం రావడం చేస్తున్నారు. ఎందుకంటే వాస్తు దోషమని ప్రచారం జరిగింది. నిజానికి సెక్రటేరియట్‌లో కూడా చాలా మార్పులు చేశారని తెలుస్తోంది. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో సెక్రటేరియట్ బాహుబలి గేట్‌ కంప్లీట్‌గా క్లోజ్ అయిపోయింది.

స్థలం ఓకే అయ్యింది… ఇక డిజైన్ పెండింగ్. ఇదే ఇప్పుడు ఎక్కువ వివాదానికి కారణమైంది. కేసీఆర్ తీసుకొచ్చిన తెలంగాణ విగ్రహం గడీలల్లో ఉండే దొరసానిలా ఉంది. ఆమెకు కీరిటం ఎందుకు? ఆ నగలు ఎందుకు? తెలంగాణలో అలా ఎవరైనా ఉంటారా? అంటూ సీఎం రేవంత్ ప్రశ్నలు సంధించారు. సాదాసీదాగా.. తెలంగాణ పోరాటానికి ప్రతీకగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని అసెంబ్లీ సాక్షిగానే ప్రకటించారు. తీరా ఆ డిజైన్‌ను రివిల్ చేశాక మరిన్ని విమర్శలు మొదలయ్యాయి.

పాత విగ్రహానికి, కొత్త విగ్రహానికి చాలా మార్పులు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఎవరు ప్రభుత్వంలో ఉంటే వారి మాటే చెల్లుతుంది.. వారి చెప్పిందే వేదం.. అనే ట్రెండ్ నడుస్తోంది కాబట్టి ఎవరిని తప్పు పట్టాల్సిన పని లేదు. కానీ తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ లేకపోవడం మాత్రం కాస్త లోటు అనే చెప్పాలి. తెలంగాణ అంటేనే బతుకమ్మ. అలాంటి బతుకమ్మ కనిపించడం లేదు ఆ విగ్రహంలో. మరోకటి బతుకమ్మను తొలగించి ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తంలా ఆమెను డిజైన్ చేయడం మరింత వివాదానికి కారణమైంది.

ఈ డిజైన్ బయటికి వచ్చాక మొదలైంది అధికార, విపక్షాల మధ్య డైలాగ్ వార్. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ అస్థిత్వాన్ని, గుర్తులను చెరిపేయడమే టార్గెట్‌గా పెట్టుకొని ముందుకు పోతుంది.. అందుకే ఒక్కో పేరును, డిజైన్‌ను మారుస్తూ వస్తుంది.. తెలంగాణకు ఐడెంటిటిగా ఉన్న బతుకమ్మను ఎందుకు తొలగించారు.. హస్తం గుర్తును ఎందుకు పెట్టారు…? అంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. తెలంగాణలోని మహిళలంతా సాధారణంగానే ఉంటారు.. తెలంగాణ మహిళలంటే పోరాటానికి ప్రతీక.. అందుకే ఇలా డిజైన్ చేశాం.. ఇది కాంగ్రెస్ సమాధానం. అంతేకాదు కొందరు నేతలు బతుకమ్మను తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఆడరు కదా అని కూడా అనేస్తున్నారు.. నిజానికి ఈ వివాదంపై అధికార, విపక్షాలు సై అంటే సై అంటున్నాయి.

ఒక విషయం మాత్రం క్లియర్ కట్‌గా కనిపిస్తోంది. తెలంగాణపై తన మార్క్ చూపించుకోవాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఫోర్త్ సిటీకి శంకుస్థాపన కావొచ్చు.. TS నుంచి TGగా మార్చడం కావొచ్చు.. తెలంగాణ తల్లి విగ్రహం కావొచ్చు.. ప్రస్తుతం ఆయనకు గుర్తింపు దక్కాలన్న ఆశ మాత్రం ఆయనలో కనిపిస్తోంది. మరి ఈ తెలంగాణ తల్లి వివాదం ఇంకేంత దూరం వెళుతుందో చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com