తెలంగాణ విద్యార్థులు, యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వారిని ఉద్యోగాలకు అర్హులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ… సింగపూర్ కి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంస్ధతో శుక్రవారం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుల సమక్షంలో స్కిల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారవు, సింగపూర్ ఐటీఈ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్‌లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు. సింగపూర్‌కి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పదో తరగతి విద్యార్థుల స్ధాయి నుంచి చదువు పూర్తైన యువతతో పాటు ఆసక్తి ఉన్న ఏ వయసు వారికైనా నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తుంది. స్కిల్ ఫర్ ప్యూచర్, స్కిల్ ఫర్ లైఫ్ అనే నినాదంతో పని చేస్తున్న ఐటీఈలో ప్రస్తుతం 28 మంది శిక్షణ పొందుతున్నారు. ఈ ఇనిస్టిట్యూట్‌లో వంద ఫుల్ టైమ్ కోర్సులకు క్యాంపస్ మరియూ ఆన్‌లైన్ శిక్షణ కూడా ఇస్తారు. ఐటీఈకి ఐదు వేల పరిశ్రమలతో భాగస్వామ్యం ఉంది. ఆయా పరిశ్రమలకు అవసరమైన అంశంపై నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. తెలంగాణలో ఇదే స్పూర్తితో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ తన విద్యార్థులకు ఐటీఈతో శిక్షణ ఇప్పించేలా శుక్రవారం ఒప్పందం చేసుకుంది. ఈ ఎంఓయు వల్ల సింగపూర్ ఐటీఈ పాఠ్యాంశాలను తెలంగాణలోని స్కిల్ యూనివర్శిటీ ఉపయోగించుకునే వీలు కలుగుతుంది. ఈ కార్యక్రమంలో సీయం రేవంత్ తో పాటు తెలంగాణ నుంచి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రత్యేక ప్రధానకార్యదర్శి జయేష్ రంజన్‌లు పాల్గొన్నారు.