హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుని ఆనుకుని నిర్మించిన అంతర్జాతీయ స్ధాయి వాకింగ్ ట్రాక్ నెర్రెలువాచింది. ట్రాక్ మధ్యలోకి చీలిపోయి బీటలు వారడంతో వాకర్స్ నడవడానికి ఇది ఇబ్బందిగా మారింది. నగర ప్రజలు ప్రతి రోజు వాకింగ్ చేయడానికి ఔటర్ రింగ్ రోడ్డుని ఆనుకుని వట్టినాగులపల్లి దగ్గర దాదాపు 90 కోట్ల రూపాయల వ్యవయంతో ఈ వాకింగ్ ట్రాక్ నిర్మించారు. అయితే నిర్మాణంలో నాణ్యత లోపించడం వల్ల ఇలా ట్రాక్ బీటలువారుతోందని వాకర్లు అంటున్నారు. చాలా చోట్ల ట్రాక్ మీద పెద్ద పెద్ద పగుళ్ళు ఏర్పడుతుండటంతో వాకర్లకు చాలా ఇబ్బందిగా ఉంటోంది. అయితే ట్రాక్‌పై పగుళ్ల గురించి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అధారిటీకి వాకర్లు ఫిర్యాదు కూడా చేశారు. హెచ్‌ఎమ్‌డీఏ అధికారుల ట్రాక్ మరమ్మతు చేసినప్పటికీ మళ్ళీ పగుళ్ళు ఏర్పడుతున్నాయి. అయితే వట్టినాగులపల్లిలో నిర్మించిన ఈ అంతర్జాతీయ వాకింగ్ ట్రాక్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ వేసిన 3500 ఎంఎం పైప్‌లైన్లపై నిర్మించారు. దీంతో హెచ్‌ఎమ్‌డీఏ ఎన్నిసార్లు మారమ్మత్తులు చేసినా అది తాత్కాలికమే అవుతోంది తప్ప శాస్వత పరిష్కారం దొరకడం లేదని వాకర్లు వాపోతున్నారు. పైప్‌లైన్ నిర్మాణ సమయంలోనే సరిగా ట్రెంచ్ రీఫిల్లింగ్ చేయకపోవడం వల్ల పునాదికి దెబ్బ తగులుతోందని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. ట్రాక్‌పై పగుళ్ళకు పైప్‌లైన్ లీకేజ్ కూడా తోడైతే వాకింగ్ ట్రాక్ మొత్తం పూర్తిగా కొట్టుకుపోయే పరిస్ధితులు ఉత్పన్నమవుతాయని వాకర్లు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలలోపు త్వరగా ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే తొందరలో వాకింగ్ ట్రాక్ పూర్తి చేయడం వల్ల నాణ్యత లోపించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 23 కిలో మీటర్ల వాకింగ్ ట్రాక్ పైన 16 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలనే సంకల్పంతో సోలార్ ప్యానల్స్ కూడా ఏర్పాటు చేశారని దాని పనితీరు కూడా అనుకున్న విధంగా లేదనే విమర్శలు వినిపిస్తు్న్నాయి. 90 కోట్ల రూపాలు వృధాగా పోకుండా ఉండాలంటే ఈ వాకింగ్ ట్రాక్‌పై ఏర్పాడిన పగుళ్ళను పూడ్చి భవిష్యత్తులో మళ్ళీ రాకుండా శాస్వత పరిష్కారం చూపాలని వాకర్స్ డిమాండ్ చేస్తున్నారు.