– 2030 నాటికి 20 ఏళ్ల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యం
– రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి AI, ఫ్యూచర్ సిటీలు రీజినల్ రింగ్ రోడ్డు
తెలంగాణ రాష్ట్రం గ్రీన్ పవర్ రంగంలో అద్భుత విజయాలను సాధించి, దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోందని ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సాంకేతికత, ఫార్మాస్యూటికల్స్, ఉత్పత్తి , వ్యవసాయ రంగాల అభివృద్ధికి కేంద్రంగా ఉద్భవిస్తోందన్నారు . స్వచ్ఛమైన శక్తి వనరుల వినియోగంలో ముందంజ వేస్తూ, తెలంగాణ 11,399 మెగావాట్ల గ్రీన్ పవర్ సామర్థ్యాన్ని సొంతం చేసుకుని, 2030 నాటికి 20,000 మెగావాట్ల లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతోందన్నారు.
రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఫార్మాసిటీకి ప్రణాళికలు రూపొందించామని ఉప ముఖ్యమంత్రి భట్టి వెల్లడించారు. విస్తరిస్తున్న పట్టణ జనాభా అవసరాలను తీర్చేలా గ్రీనరీ, స్థిరమైన పట్టణ పర్యావరణ వ్యవస్థ రూపకల్పనలో భాగంగా ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుట్టామన్నారు. అలాగే, హైదరాబాద్ సమీపంలో అత్యాధునిక కృత్రిమ మేధస్సు, స్మార్ట్ టెక్నాలజీలతో ఆధునిక నగరం ఏఐ సిటీని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. వీటితో పాటు.. తెలంగాణను గ్లోబల్ ఫార్మాస్యూటికల్ హబ్‌గా తీర్చిదిద్దుతూ, లైఫ్ సైన్సెస్ రంగంలో అగ్రగామిగా మార్చేలా ఫార్మా సిటీకి రూపకల్పన చేశామన్నారు. అన్నింటికీ అనుసంధానం చేస్తూ మెరుగైన కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫోర్త్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్, మెట్రో రైలు విస్తరణ, , విమానాశ్రయం, పారిశ్రామిక కారిడార్‌తో రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ పవర్‌హౌస్‌గా మారుస్తున్నాయని భట్టి విక్రమార్క వివరించారు.
ఇక, పునరుత్పత్తి శక్తి సామర్థ్యాలపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్నామని విక్రమార్క చెప్పారు. ప్రస్తుత పునరుత్పత్తి శక్తి సామర్థ్యం 11,399 మెగావాట్లు ఉందని, వీటిలో 7,889 మెగావాట్ల సౌరశక్తి, 2,518 మెగావాట్ల జలశక్తి, 771 మెగావాట్ల పంపిణీ పునరుత్పత్తి శక్తి, 221 మెగావాట్ల ఇతర పునరుత్పత్తి శక్తి.. ఇందులో 128 మెగావాట్లు పవన శక్తి తెలంగాణలో ఉత్పత్తి అవుతోందన్నారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టుల్లో పంప్డ్ స్టోరేజ్ వున్నాయన్న భట్టి.. ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ వంటి ఆధునిక పరిష్కారాలు పరిశీలనలో ఉన్నాయన్నారు. 54,717 మెగావాట్ల పవన సామర్థ్యం కలిగి, దేశంలో టాప్-8 రాష్ట్రాలలో ఒకటిగా నిలుస్తోందన్నారు. విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేలా.. 872 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఇప్పటికే అందుబాటులోకి తెచ్చామన్నారు. రాష్ట్రంలో 2024 ఫైనాన్షియల్ ఇయర్‌లో గరిష్ట విద్యుత్ డిమాండ్ 15,623 మెగావాట్లనుంచి 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 24,215 మెగావాట్లకు, అలాగే, 2035 ఆర్థిక సంవత్సరానికి 31,809 మెగావాట్ల వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నామన్నారు. అందుకే 2030 నాటికి రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని 20వేల మెగావాట్లు చేరుకునే లక్ష్యం పెట్టుకున్నామన్నారు. ఈ డిమాండ్‌ను నెరవేర్చేందుకు స్వచ్ఛమైన, నమ్మదగిన, సరసమైన, మరియు స్థిరమైన శక్తి వనరులు ముఖ్యమైనవని, తెలంగాణ రాష్ట్రం 54,717 మెగావాట్లకు పైగా గాలివస్తు సామర్థ్యాన్ని కలిగి ఉందని, అదనంగా, 300 మెగావాట్ల ఫోటోవోల్టిక్ సోలార్ ప్రాజెక్టులకు అనుకూలమైన ప్రాంతంగా నిలుస్తోందన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ, పంప్‌డ్ స్టోరేజ్ వంటి ఆధునిక పద్ధతులను ప్రోత్సహిస్తోందని డిప్యూటీ సీఎం తెలిపారు.
ఇక, రాష్ట్ర సమగ్ర ప్రగతే లక్ష్యంగా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నామని, విద్యుత్ వాహన చార్జింగ్ స్టేషన్ల సంఖ్య ప్రస్తుతం 872కి చేరుకుందనిచెప్పారు. పారిశ్రామికవేత్తలకు పన్ను మినహాయింపులు, చెల్లింపుల సబ్సిడీలు వంటి ప్రోత్సాహకాలు అందించడం ద్వారా పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నామన్నారు. అంతేకాకుండా వ్యర్థాలను శక్తిగా మార్చడం వంటి ప్రాజెక్టులను కూడా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందన్నారు. ఇక, ప్రజలకు అందుబాటులో విద్యుత్ ఉండేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడంతో పాటు శక్తి వినియోగంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ క్రమంలో రాష్ట్రం మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. తెలంగాణ పునరుత్పత్తి శక్తి రంగంలో ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో ఉందని, ఈ రంగంలో రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలు దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయన్నారు. ప్రస్తుత పునరుత్పత్తి శక్తి ప్రాజెక్టుల ద్వారా వేలాది కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్రం సుస్పష్టమైన విధానాలను అమలు చేస్తోందని చెప్పారు. 2030 నాటికి 20వేల మెగావాట్ల సామర్థ్యాన్ని చేరుకోవడం మాత్రమే కాకుండా, తెలంగాణ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని దాన్ని సాధించేందుకు దృఢ నిశ్చయంతో పనిచేస్తుందన్నారు. తెలంగాణ పునరుత్పత్తి శక్తి రంగంలో సాధిస్తున్న ఈ అద్భుత విజయాలు రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేస్తూ, శక్తి వినియోగంలో స్వచ్ఛమైన మార్గాలను అనుసరించే దేశానికే ఒక దిశానిర్దేశం అందిస్తున్నాయని భట్టి విక్రమార్క వెల్లడించారు.