-
ఫస్టియర్‌లో 65.96 శాతం ఉత్తీర్ణత
-
సెకండియర్‌లో 65.65 శాతం పాస్
-
ఫలితాల్లో బాలికలదే పైచేయి
తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రిజల్ట్స్‌ను రిలీజ్ చేశారు. రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇంటర్ ఫలితాలను భట్టి విక్రమార్క అధికారికంగా విడుదల చేశారు.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 65.96 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ఇక, రెండో సంవత్సరంలో 65.65 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఈ యేడాది మొత్తం ఇంటర్మీడియట్ పరీక్షలకు 9.97 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
ఇక, ఈ యేడాది ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికల ఉత్తీర్ణతా శాతం బాలుర కంటే ఎక్కువగా నమోదయ్యింది. మొదటి సంవత్సరం ఫలితాల్లో 73.08 శాతం మంది బాలికలు పాస్ అయ్యారు. అలాగే, రెండో సంవత్సరంలో 77.73శాతం బాలికలు ఉత్తీర్ణులయ్యారు.
ఇక బాలుర ఉత్తీర్ణతా శాతం చూస్తే.. ఇంటర్ ఫస్టియర్‌లో 59.74 శాతం బాలురు పాస్ కాగా.. సెకండియర్‌లో 64.60 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు.
ఇక, జిల్లాల వారీగా ఉత్తీర్ణతా శాతం చూసుకుంటే.. ఫస్టియర్ రిజల్ట్స్‌లో మేడ్చల్ జిల్లా 77.21 శాతంతో తొలి స్థానంలో నిలిచింది. మహబూబాబాద్ జిల్లా 48.43 శాతం ఫలితాలతో చివరి స్థానంలో నిలిచింది. సెకండియర్ రిజల్ట్స్ చూసుకుంటే.. ములుగు జిల్లా 80.12 శాతంతో ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా.. కామారెడ్డి జిల్లా 54.93శాతంతో లాస్ట్ ప్లేస్‌లో నిలిచింది.