మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. సత్యనాదెళ్ల హైదరాబాద్ రావడంతో మర్యాదపూర్వకంగా ఆయనను కలిశారు రేవంత్‌రెడ్డి. రేవంత్‌రెడ్డితో పాటు.. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, తదితరులు ఉన్నారు. బంజారాహిల్స్‌లోని సత్య నాదెళ్ల ఇంటికి వెళ్లిన సీఎంరేవంత్.. ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రధానంగా స్కిల్ యూనివర్సిటీ గురించి ఆయనతో చర్చించారు.
ఇటీవలే హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ సెంటర్‌లో దాదాపు 4వేల ఉద్యోగాలు ఇచ్చేలా ఒప్పందాలు జరిగాయి. ఈ క్రమంలోనే దీనికి సంబంధించి పురోగతిపై సత్యనాదెళ్లతో రేవంత్‌చర్చించారు. అలాగే, రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీలో ప్రధాన భాగస్వామిగా ఉండాలని రేవంత్ ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీల గురించి రాష్ట్రప్రభుత్వ లక్ష్యాలను సత్యనాదెళ్లకు ఈ సందర్భంగా వివరించారు రేవంత్‌రెడ్డి. అలాగే, క్లౌడ్ కంప్యూటింగ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయబోతున్నామని అందులో కూడా మైక్రోసాఫ్ట్ కీలక పాత్ర పోషించాలని రేవంత్ కోరినట్లు సమాచారం. అలాగే, ఓపెన్ ఏఐ నుంచి ఉచిత క్రెడిట్స్ ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో తెలంగాణలో నాలుగు డేటా సెంటర్లు, హైదరాబాద్ కేంద్రం విస్తరణపై కూడా చర్చ జరిగింది.