24.8 C
Hyderabad
Tuesday, August 11, 2026

Live Video

spot_img

కమీషన్ల కాంగ్రెస్ సర్కార్…కేంద్ర మంత్రి బండి సంజయ్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ బిల్లు మంజూరు కావాలన్నా 8 నుండి 14 శాతం కమీషన్లు దండుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ కేబినెట్ లో కొందరు నిజాయితీ మంత్రులున్నారని, వారికి ఈ విషయం ఏ మాత్రం నచ్చడం లేదన్నారు. ఈ కమీషన్లపై కాంగ్రెస్ లోనే అంతర్యుద్ధం నడుస్తోందని, ఎప్పుడైనా ఈ కమీషన్ల భాగోతం బద్దలు కావొచ్చని అన్నారు.. కమీషన్ల మోజులో పడి ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు కప్పం కడుతూ తమ సీటును కాపాడుకోవడానికే కాంగ్రెస్ పాలకులు పరిమితమయ్యారే తప్ప ప్రజా సమస్యలను పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో పెండింగ్ బిల్లులు మంజూరు కాక రాష్ట్రవ్యాప్తంగా 12 వేలకు మాజీ సర్పంచులు రోడ్డున పడ్డా రేవంత్ రెడ్డి సర్కార్ కు చీమ కుట్టినట్లయినా లేదని మండిపడ్డారు. మాజీ సర్పంచులకు కిషన్ రెడ్డి నాయకత్వంలో బీజేపీ అండగా నిలుస్తోందన్నారు. మాజీ సర్పంచుల పక్షాన అతి త్వరలోనే ఉద్యమిస్తామన్నారు.
ఈరోజు మధ్యాహ్నం తాజా మాజీ సర్పంచుల రాష్ట్ర సంఘం అధ్యక్షులు అక్కినపల్లి కరుణాకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జేఏసీ నాయకులు కరీంనగర్ ఎంపీ కార్యాలయానికి తరలివచ్చి బండి సంజయ్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా కరుణాకర్ మాట్లాడుతూ ‘‘ఈ రాష్ట్రంలో ఎన్నో సమస్యలపై పోరాడి పరిష్కారం చూపిన నాయకుడు బండి సంజయ్. మాజీ సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఆయన ద్రుష్టికి తీసుకొచ్చి పరిష్కరిస్తారనే నమ్మకంతో కలిసి వినతి పత్రం సమర్పించాం. మేం ప్రజల కోసం పనులు చేసి అప్పుల పాలైతే… కనీసం పెండింగ్ బిల్లులు మంజూరు చేయకపోవడంతో ఇయాళ రోడ్డున పడ్డాం. మా పక్షాన పోరాడాలని సంజయన్నను కోరాం. అండగా ఉంటానన్న భరోసానిచ్చిన బండి సంజయ్ అన్నకు రుణపడి ఉంటాం…’’అని పేర్కొన్నారు. అనంతరం బండి సంజయ్ వారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. ఏమన్నారంటే….
కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకత్వం ఎప్పుడు సమావేశమైనా తాజా మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లుల అంశం చర్చకు వస్తుంది. మాజీ సర్పంచుల ప్రజల కోసమే పనులు చేశారు. సొంత డబ్బు ఖర్చు పెట్టి అభివ్రుద్ది పనులు చేసిన మాజీ సర్పంచులకు అండగా ఉండాలని నిర్ణయించాం. వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా 12వేల 769 మంది తాజా మాజీ సర్పంచులున్నరు. వీళ్లందరికీ దాదాపు 13 వందల కోట్ల రూపాయలు బిల్లులు రావాలి. గ్రామాల్లో చేసిన అభివ్రుద్ధి పనులకుగాను ఒక్కో సర్పంచుకు 3 లక్షల నుండి కోటి రూపాయల వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఇయాళ ఏ గ్రామానికి వెళ్లినా 1.పల్లె ప్రగతి 2.రైతు వేదిక 3. వైకుంఠ ధామం 4.డంపింగ్ యార్డ్ 5.పల్లె ప్రక్రుతి వనం 6.హరిత వనం 7.రెవిన్యూ ప్లాంటేషన్ 8.కమ్యూనిటీ హాల్ 9.హైమాస్ లైట్స్ 10.అంతర్గత సీసీ రోడ్లు 11.సీసీ డ్రైనేజీలు 12.మిషన్ భగీరథ 13.ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్ మెంట్ 14.మన ఊరు..మన బడి వంటి అభివ్రుద్ధి కార్యక్రమాలు కళ్ల ముందే కన్పిస్తున్నాయి. ఇవన్నీ జరిగాయంటే అది తాజా మాజీ సర్పంచులవల్లేనని ప్రజలకు తెలుసు. ఇయాళ సర్పంచులు లేకపోవడంతో గ్రామాల్లో తట్టెడు మట్టి పోయించేటోళ్లు కూడా లేరని చర్చించుకుంటున్నరు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ బిల్లులన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చి ఓట్లు దండుకున్న రేవంత్ ప్రభుత్వం ఏడాదైనా నయా పైసా బిల్లు చెల్లించకపాయే. పాపం బిల్లుల కోసం ఈ తాజా మాజీ సర్పంచులు ఎక్కని గడప లేదు… దిగని గడప లేదు… ఎంపీడీఓ నుండి కలెక్టర్, చీఫ్ సెక్రటరీ వరకు…. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల మొదలు ముఖ్యమంత్రి వరకు అందరినీ కలిసి మొర పెట్టుకున్నరు. అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు… మాజీ సర్పంచులను రోడ్డున పడేశారు. ఇంకా చెప్పాలంటే… మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్లులు ఎందుకు ఇవ్వాలనే భావనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మాజీ సర్పంచులవైపు ప్రజలున్నారనే సంగతిని మర్చిపోతున్నరు. ప్రభుత్వాన్ని నమ్మి అభివ్రుద్ధి పనులు చేస్తే వాళ్ల బతుకులను బర్ బాద్ చేయడం కరెక్ట్ కాదు… వాళ్లు ప్రజల్లోకి వెళితే… ఈ ప్రభుత్వాన్ని కాపాడటం ఎవరి తరమూ కాదనే సంగతి గుర్తుంచుకోవాలి.
తాజీ మాజీ సర్పంచులారా… కాంగ్రెస్ ను నమ్మి మీరు నిండా మోసపోయారు. ఇకనైనా కళ్లు తెరవండి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలు, జెండాలను పక్కనపెట్టి కాంగ్రెస్ ను ఓడించడమే ధ్యేయంగా పనిచేయండి. మీరు చేసే ఉద్యమానికి బీజేపీ పూర్తి అండగా ఉంటుంది. కిషన్ రెడ్డి గారితో ఫోన్ లో మాట్లాడాను. మద్దతు ప్రకటించాలని చెప్పారు…ఈ విషయంలో బీజేపీ ముందుండి మీ తరపున పోరాడతాం. రాష్ట్ర ప్రజల మెడలు వంచుతాం…
కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల సర్కార్. 8 నుండి 14 శాతం కమీషన్లతో నడుస్తోంది. పెండింగ్ బిల్లులు మంజూరు కావాలంటే వాళ్లకు 8 నుండి 14 శాతం కమీషన్లు ఇస్తే మీ నిధులన్నీ విడుదలవుతాయి. కమీషన్లు దండుకునేందుకు ప్రత్యేకంగా ముగ్గురు మంత్రులను పెట్టుకున్నరు. 14 శాతం కమీషన్లు ఎవరైతే ఇస్తారో… వాళ్లకే బిల్లులు మంజూరవుతున్నాయి. ఈ కమీషన్ల సొమ్మును ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలకు కప్పం కడుతూ తమ సీటును కాపాడుకుంటున్నరు. కప్పం కట్టకపోతే ఎన్నడూ ఆ సీట్లు ఎగిరిపోయేయి. రేవంత్ కేబినెట్ లో కొందరు నిజాయితీపరులైన మంత్రులు కూడా ఉన్నారు. కమీషన్ల గోల భరించలేక వాళ్లు లొల్లి పెడుతున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ లో అంతర్యుద్దం జరుగుతోంది. అది ఎప్పుడైనా బహిరంగం కావొచ్చు.
అసలు ఈ ప్రభుత్వంపట్ల ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లించకపోవడంతో లక్షల మంది విద్యార్థులు అల్లాడుతున్నరు.వాళ్లకు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. కాలేజీ యాజమాన్యాలు జీతాలు చెల్లించలేక కాలేజీలను మూసి వేస్తున్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలను విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సకు వచ్చే రోగులను చేర్చుకోవడం లేదు…ఇకనైనా ప్రభుత్వం దిగిరావాలి. లేనిపక్షంలో కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పేందుకు సర్పంచులతో కలిసి ఉద్యమిస్తాం…రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచి బిల్లులు చెల్లించేలా చేస్తాం…
రాష్ట్రంలో క్రైం రేటు పెరిగిందనే అంశంపై అడిగిన ప్రశ్నకు…..
22శాతం క్రైం రేటు పెరిగింది. మహిళలపై అత్యాచారాలు 28 శాతం పెరిగింది. శాంతి భద్రతలను కాపాడాలేని చేతగాని సర్కార్ నడుస్తోంది. వీళ్లకు ప్రజల బాధలు పట్టవు. ఢిల్లీకి పోయి కప్పం కట్టి పదవులను కాపాడుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజలను ఆదుకోవాలని లేదు… 6 గ్యారంటీలను అమలు చేయాలనే ధ్యాస లేదు..
రేవంత్ రెడ్డి గొప్పనాయకుడని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యానించారంటూ…. మీడియా అడిగిన ప్రశ్నకు….
పవన్ కళ్యాణ్ ఏమన్నారో నాకు తెలియదు. నేను వినలేదు. నిజంగా గొప్ప నాయకుడని అని ఉంటే… ఆయనలో మరి ఏం కన్పించిందో.. 6 గ్యారంటీలను అమలు చేయలేదు. ఇచ్చిన హామీలను ఏవీ అమలు చేయలేదు? క్రైం రేటు పెరిగింది. మరి ఆయనలో గొప్ప నాయకుడు ఎట్లా కన్పించారో వారికే తెలియాలి.
అల్లు అర్జున్ ఘటనపై…
అల్లు సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్టై జైలుకు పోయి బెయిల్ వచ్చాడు. ఆ అంశం ముగిసింది. కానీ మళ్లీ అసెంబ్లీలో మరే సమస్య లేనట్లు ఈ అంశంపై గంటల తరబడి చర్చ జరపాల్సిన అవసరం ఏముంది? 6 గ్యారంటీలపై చర్చ జరగకుండా దారి మళ్లించాలనే కుట్రలో భాగమే. నాకు తెలిసి రేవంత్ రెడ్డికి, అల్లు అర్జున్ కు మధ్య ఏదో చెడింది. పుష్ప 2 సినిమాకు 1700 కోట్ల రూపాయల వచ్చినయ్. పుష్ప 2 సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు.. కానీ పుష్ప 3 సినిమా చూపించారు. నేనడుగుతున్నా… అల్లు అర్జున్ పై కేసును మ్రుతురాలి భర్త వాపస్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు కదా… ఇంకా దీనిపై ఎందుకు రాద్దాంతం చేస్తున్నారు…
మన్మోహన్ సింగ్, అంబేద్కర్ లను బీజేపీ అవమానించిందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై…
అంబేద్కర్ ను అడుగడుగునా అవమానించిందే కాంగ్రెస్ పార్టీ. ఆయనకు భారతరత్న ఎందుకు ఇవ్వలేదు? పంచ్ తీర్థ్ లను ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఆయన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడించేందుకు ఎందుకు ప్రయత్నించింది? మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు చనిపోతే ఢిల్లీలో అంత్యక్రియలు జరపకుండా ఎందుకు అవమానించారు? నాటి ప్రధాని వీపీ సింగ్ విషయంలో ఇట్లనే అవమానించింది నిజం కాదా? మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నన్నాళ్లూ… సోనియాగాంధీ సూపర్ పీఎంగా ఉంటూ రబ్బర్ స్టాంప్ గా తయారు చేసింది నిజం కాదా? కాంగ్రెస్ తీరును చూసి మన్మోహన్ సింగ్ ఆత్మ క్షోభిస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com