మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తరహాలో.. రేవంత్ వ్యవహరిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. మూసీ మీద ఆందోళన చేస్తే.. వ్యక్తిగతంగా మాట్లాడతారు తప్ప సమాధానం ఇవ్వరన్నారు. వంద రోజుల్లో 6 గ్యారెంటీలు. ఏడాదిలో 420కి పైగా సబ్ గ్యారెంటీల అమలులో పూర్తి వైఫల్యం చెందారని విమర్శించారు.
తెలంగాణ బీజేపీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యలు ఈ రోజు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడిని కలిశాక కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రజాసమస్యల మీద ఎప్పుడూ పనిచేయాలని.. ప్రభుత్వంతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని ప్రధాని మోడీ సూచించారని పేర్కొన్నారు. ప్రధాని మోడిని 8 మంది లోక్ సభ సభ్యులు, రాజ్యసభ్యుడైన డాక్టర్ లక్ష్మణ్, 7 మంది శాసన సభ్యులు, ఒక ఎమ్మెల్సీ కలిశారు. బీజేపీ శాసనసభాపక్షనేత మహేశ్వర రెడ్డి కూతురు వివాహ పనులున్నందున హాజరు కాలేదు.
కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ ఆయన మాటల్లోనే
మహిళలు, యువత, రైతులు, నిరుద్యోగ యువత.. విద్యారంగం ఇవాళ అన్ని రంగాల్లో సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోయాయి. కానీ.. వారంరోజులపాటు ఉత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటు.
నేను సమస్య గురించి మాట్లాడితే.. కిషన్ రెడ్డి డీఎన్ఏ ఏంటి అని అడుగుతున్నారు. నా డీఎన్ఏ బీజేపీ డీఎన్ఏ మీలాగా పది పార్టీలు తిరిగిన డీఎన్ఏ కాదు..
బీజేపీ పార్టీ తరపున.. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలమీద.. డిసెంబర్ 1 నుంచి 5 వరకు.. రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడతాం. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం.
రెండ్రోజుల క్రితం కొమురం భీం జిల్లాలో.. శైలజ అనే అమ్మాయి.. ఫుడ్ పాయిజనింగ్ తో చనిపోయింది.
దీని మీద సీఎం కనీసం దృష్టిపెట్టరు. సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయరు. సంబంధం లేని విషయాలపైనా ఆయనకు ఆసక్తి ఎక్కువ. గతంలో బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ కారణంగా.. రాష్ట్రం నష్టపోతోంది. రాజకీయ వ్యవస్థ భ్రష్టు పడుతోంది.
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు, వ్యక్తిగత దాడులు.. అసాధ్యమైన అంశాలతో.. ప్రజలను మభ్యపెట్టేలా పనులు చేయడంలో ఇద్దరూ ఇద్దరే. చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు.
సకాలంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పినా.. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నిస్సిగ్గుగా.. కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన వారు బీఆర్ఎస్ లో చేరి.. మంత్రులయ్యారు. ఆ పార్టీ నాయకులు.. అక్కడ గెలిచి.. ఇక్కడ మంత్రులయ్యారు ఇంతకన్నా సిగ్గుచేటు ఉంటుందా? ఇంతకన్నా రికార్డులు, సాక్ష్యాలు ఇంకేం కావాలి.
మహిళలకు సంబంధించి.. తులం బంగారం, కల్యాణ లక్ష్మి, వృద్ధాప్య పింఛన్, దివ్యాంగుల పింఛన్.. ఒక్క రూపాయి కూడా పెరగలేదు. ఉన్నది సరిగ్గా ఇవ్వడం లేదు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఉన్న రేషన్ కార్డులే ఇంకా నడుస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లు అవుతున్నా.. తెలంగాణ రాష్ట్రం లో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేక పోవడం దురదృష్టకరం.
అప్రజాస్వామిక భాష మాట్లాడటాన్ని కేసీఆర్ ప్రవేశపెడితే.. రేవంత్ కొనసాగిస్తున్నాడు.
అసలు రాష్ట్రంలో ఏం మార్పు వచ్చింది.
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పూర్తిగా దెబ్బతిన్నది. గతంలో.. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అప్పులమీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపితే.. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి. 30వ తేదీనాడు.. దీనిపై విస్తృతస్థాయిలో హైదరాబాద్ లో చర్చిస్తాం. ఆ తర్వాత డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు ఇంటింటికి వెళ్తాం. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతాం.
రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నం బీజేపీ ఏనాడూ చేయలేదు. చేయదు. డిసెంబర్ చివరి నాటికల్లా.. సంస్థాగత ఎన్నికలు పూర్తవుతాయి. పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తవుతుంది.