ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేశారు. మే 15వ తేదీ నుంచి ఉపాధ్యాయుల బదిలీలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ, బదిలీలకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుంది. ఈ ఏడాది ఉపాధ్యాయుల బదిలీలను కొత్తగా తీసుకొచ్చిన బదిలీ చట్టం ప్రకారం తొలిసారిగా నిర్వహించనున్నారు. అయితే, అంధులైన ఉపాధ్యాయులు ఈ చట్టాన్ని హైకోర్టులో సవాల్ చేయగా, వారి బదిలీలపై కోర్టు స్టేటస్‌కో విధించింది. వీరి పోస్టులను వదిలేసి మిగిలిన ఉపాధ్యాయుల బదిలీలను పూర్తిచేయాలని విద్యాశాఖ యోచిస్తోంది.
బదిలీల కోసం ఉపాధ్యాయులు ఆప్షన్లను నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత అంధ ఉపాధ్యాయుల బదిలీలు చేపడతారు. మొదట ప్రధానోపాధ్యాయులను బదిలీ చేసి, ఖాళీ అయిన పోస్టులను స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతులకు ఉపయోగిస్తారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో ఖాళీలను బట్టి సెకండరీ గ్రేడ్ టీచర్లకు పదోన్నతులు కల్పిస్తారు. ఈ పోస్టుల అవసరం తక్కువగా ఉన్నట్టు సమాచారం. అదేవిధంగా, ఎస్జీటీ లకు ఆదర్శ ప్రాథమిక పాఠశాలల హెడ్ మాస్టర్ పదోన్నతులు ఇస్తారు. సబ్జెక్టు టీచర్లకు ఆదర్శ పాఠశాలల హెడ్ మాస్టర్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుంది.
విద్యాశాఖ ఉమ్మడి జిల్లాల వారీగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను సిద్ధం చేసింది. ఇప్పటికే జీఓ 117కు ప్రత్యామ్నాయంగా పోస్టుల హేతుబద్ధీకరణ పూర్తయింది. ఈసారి మొత్తం బదిలీల ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. మే 31 నాటికి 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉపాధ్యాయులు, 5 ఏళ్ల సర్వీసు పూర్తయిన హెచ్ఎంలు తప్పనిసరిగా బదిలీ అయ్యేలా మార్గదర్శకాలు రూపొందించారు. అలాగే, రెండు సంవత్సరాల సర్వీసు పూర్తిచేసినవారూ దరఖాస్తు చేసుకునే అర్హత కలిగివుంటారు.
గరిష్ఠ సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు ఆప్షన్లు నమోదు చేసుకోకపోతే, బదిలీ ప్రక్రియ అనంతరం మిగిలిన ఖాళీల్లోకి వారిని పంపిస్తారు. ఇద్దరు ఉపాధ్యాయులకు సమాన పాయింట్లు ఉన్నప్పుడు సీనియారిటీ ప్రామాణికంగా తీసుకుంటారు, అది సమానం అయితే వయసు ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన ఉపాధ్యాయులకు ప్రతి నెలా ఒక మైనస్ పాయింట్ చొప్పున గరిష్ఠంగా 10 పాయింట్ల వరకు తగ్గింపు వస్తుంది.
మే 31 నాటికి పదవీ విరమణ చేయనున్న ఉపాధ్యాయుల పోస్టులు కూడా ఖాళీలుగా పరిగణించి వాటిని బదిలీ ప్రాతిపదికగా తీసుకుంటారు. ఏడాది కన్నా ఎక్కువ కాలం అనధికారికంగా గైర్హాజరైన టీచర్లు, ఉన్నత విద్య కోసం సెలవులు తీసుకున్న ఉపాధ్యాయుల పోస్టులను ఖాళీలుగా చూపిస్తారు.