కిటికీలపై నిషేధం ఏంటి? మీకేమైనా పిచ్చా అనుకుంటున్నారా? అనుకోకండి. ఇది అఫ్ఘానిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా తీసుకున్న నిర్ణయం. ఇప్పటికే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చేశాయి. ఇప్పటికే కొత్త కిటికీలు కట్టేది లేదు.. ఉన్న కిటీకిలను మూసేయాలని అఫ్ఘాన్ ప్రజలు డిసైడ్ అయిపోయారు. అయితే దీని వెనక పెద్ద కథే ఉంది.
తాలిబన్‌లు 2021 ఆగస్టులో అధికారంలోకి వచ్చారు. సరికొత్త అఫ్ఘాన్‌ను ప్రపంచానికి చూపిస్తామన్నారు. చెప్పినట్టుగానే చాలా కొత్తగా చూపిస్తున్నారు. అయితే ప్రజలకు పనికొచ్చే పనులు కాకుండా.. ప్రజలకు నరకం చూపించడంలో ఆ కొత్తదనం చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా మహిళలపై. వారి ప్రాణ, మానాలకు రక్షణ కల్పిస్తున్నామంటూ వారిని కేవలం ఇంటికే పరిమితం చేస్తున్నారు. ఇప్పుడు కిటికీల నిషేధం కూడా అందుకే. ఇంట్లో ఎక్కడైనా కిటికీ ఉండొచ్చు కానీ కిచెన్‌లో మాత్రం వీలులేదు అంటున్నారు తాలిబన్లు. ఎందుకీ నిర్ణయం అంటే ఇంట్లోని మహిళలు బయటికి కనిపించకుండా ఉండేందుకు.
అఫ్ఘానిస్థాన్‌లో మహిళలు వంటింటికి మాత్రమే పరిమితం చేశారు తాలిబన్లు. అందుకే ఆ వంటింటికి కిటికీ ఉండొద్దని ఆదేశించారు. కొత్తవి కట్టకూడదు.. ఉన్నవి వెంటనే మూసేయాలి. అంతేకాదు బావుల వద్ద కూడా కిటికీలు ఉండొద్దని చెబుతున్నారు.
ఇదే కాదు పురుషులు లేకుండా ఒంటరిగా ఆడవారు బయటికి రావొద్దు.. ఆడ పిల్లలు స్కూల్‌కు వెళ్లి చదువుకోకూడదు.. మహిళలు ఉద్యోగాలు చేయకూడదు.. జిమ్‌ల్లోకి, పార్కుల్లోకి వెళ్లకూడదు.. ఇలా అనేకం ఉన్నాయి అఫ్ఘానిస్థాన్‌లో మహిళలపై ఆంక్షలు. ఇప్పుడు ఈ కిటికీ కూడా వచ్చి చేరింది. అంటే మహిళలు బయటికి రావడం కాదు కదా.. బయటి ప్రపంచం కూడా చూడకూడదన్నదే తాలిబన్ల నిర్ణయం అని దీన్ని బట్టి అర్థమవుతోంది. దీన్ని వివక్ష అని కూడా అనలేం. ఇది అణచివేత.