అందరూ అనుకున్నదే నిజమయ్యింది. మెజార్టీ సభ్యులు ఊహించిన వాళ్లనే విజయం వరించింది. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన ఎవరితో నెరవేరుతుందని సభ్యులు భావించారో వాళ్లే గెలుపును ముద్దాడారు. ఎవరి మూలంగా హౌజింగ్ సొసైటీ పురుడు పోసుకుందో.. వాళ్ల చేతుల మీదుగానే సభ్యులందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ కావాలని ఆకాంక్షించిన వాళ్ల ఆశలు ఫలించబోతున్నాయన్న సంకేతాలు వచ్చేశాయి. జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ మ్యూజువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌజింగ్ లిమిటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా నేమాని భాస్కర్, వంశీ శ్రీనివాస్ విజయం సాధించారు.
హైదరాబాద్ సోమాజిగూడ లోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌజింగ్ సొసైటీలో రెండు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ స్థానాలకు గానూ ఎన్నికలు నిర్వహించారు. ఉదయం నుంచీ ఉత్కంఠ భరితంగా సాగిన పోలింగ్‌లో ఫ్రెండ్స్ ప్యానల్ తరపున పోటీ చేసిన నేమాని భాస్కర్, వంశీ శ్రీనివాస్ విజయం సాధించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ నిర్వహించగా.. సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టారు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఎన్నికల అధికారి చోలా ఓం ప్రకాష్.. విజేతల పేర్లను అధికారికంగా ప్రకటించారు. గెలుపొందిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నేమాని భాస్కర్, ఐదేళ్ల పాటు వంశీ శ్రీనివాస్ ఏడాది పాటు ఈ పదవుల్లో కొనసాగుతారు.
సొసైటీలో రెండు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ స్థానాలు ఖాళీగా ఉండగా.. ఒక స్థానానికి నేమాని భాస్కర్, తాతా శ్రీనివాస్, కొత్తపల్లి రమేష్ బాబు పోటీ పడ్డారు. మరో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ స్థానానికి వంశీ శ్రీనివాస్, బోడపాటి శ్రీనివాస రావు పోటీ పడ్డారు.
వీటిలో ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ స్థానానికి జరిగిన పోలింగ్ వివరాలు చూస్తే.. మొత్తం 734 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 10 ఓట్లు చెల్లలేదు. చెల్లిన ఓట్లలో కొత్తపల్లి రమేష్ బాబుకు 4 ఓట్లు మాత్రమే పోల్ కాగా.. తాతా శ్రీనివాస రావుకు 334 ఓట్లు పోలయ్యాయి. ఇక, నేమాని భాస్కర్‌కు 386 ఓట్లు పోల్ అయ్యాయి. నేమాని భాస్కర్ 52 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో, నేమాని భాస్కర్ గెలుపొందినట్లు ఎన్నికల అధికారి చోలా ఓం ప్రకాష్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
ఇక, మరో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బోడపాటి శ్రీనివాస రావుకు 342 ఓట్లు పోల్ కాగా.. వంశీ శ్రీనివాస్‌కు 382 ఓట్లు పోల్ అయ్యాయి. దీంతో, వంశీ శ్రీనివాస్ 40 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి బోడపాటిపై విజయం సాధించారు. వంశీ శ్రీనివాస్ మరో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి చోలా ఓం ప్రకాష్ ప్రకటించారు.
ఫ్రెండ్స్ ప్యానల్ నుంచి పోటీ చేసిన ఇద్దరు సభ్యులూ.. ఖాళీగా ఉన్న రెండు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల స్థానాలకు విజయం సాధించడం పట్ల జేఎన్‌జే హౌసింగ్ సొసైటీ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విజయోత్సవాలు అంబరాన్నంటాయి.