25 C
Hyderabad
Tuesday, July 28, 2026

Live Video

spot_img

రాష్ట్రంలో సమస్యలు వదిలేసి ఢిల్లీకి వెళ్లిన సీఎం – కెటిఆర్ విమర్శ

కేవలం 48 గంటల్లోనే రాష్ట్రంలో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నా, ఎస్ ఎల్ బి సి టన్నెల్ ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకొని ఉన్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రోజుకు ఒక రైతు చొప్పున ఇప్పటివరకు 450 మంది రైతులు చనిపోయారని, అయినా రేవంత్ రెడ్డిలో కనీసం చలనం కూడా లేదని విమర్శించారు. ఒకప్పటి రోమ్ చక్రవర్తి నీరో లెక్కనే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని, ఇప్పుడు 36వ సారి ఢిల్లీకి వెళ్లారని చెప్పారు. ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేకపోతున్నారని, హోంశాఖ, విద్యాశాఖ, సంక్షేమ శాఖలకు మంత్రులను కూడా నియమించుకోలేని అసమర్ధుడైన రేవంత్ రెడ్డి, తెలంగాణ నుంచి కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తాడా అని ప్రశ్నించారు.

స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత మాజీ ZPTC కీర్తి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డితో పాటు సుమారు 500 మంది కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వాళ్లను పార్టీలో సాదరంగా ఆహ్వానించిన కేటీఆర్, 15 నెలల స్వల్ప కాలంలోనే అధికార పార్టీని వదిలి ప్రతిపక్ష బీఆర్ఎస్‌లో చేరుతున్నారంటే కాంగ్రెస్ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని, ఇది రాష్ట్రంలో వీస్తున్న గాలికి సంకేతమన్నారు. ఒక్క స్టేషన్ ఘన్పూర్ మాత్రమే కాదు, సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లో కూడా కాంగ్రెస్‌ను వదిలి బీఆర్ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచినా ఓడినా ఫరక్‌లేదని రేవంత్ చిద్విలాసంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్‌కు నిద్రలో కూడా కేసీఆర్ గుర్తొస్తున్నారని, నిజానికి మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తాను ముఖ్యమంత్రి అవుతానని రేవంత్ కలలో కూడా ఊహించలేదని ఎద్దేవా చేశారు.

రైతు ఆత్మహత్యలను గణనీయంగా తగ్గించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటించడం కేసీఆర్ పాలన దక్షత, రైతులపై ప్రేమకు నిదర్శనమన్నారు కేటీఆర్. శివుడు గంగమ్మ తల్లిని దివి నుంచి గుడికి తీసుకొస్తే, కేసీఆర్ గోదావరి నదిని 80 మీటర్ల నుంచి 618 మీటర్ల పైకి తీసుకొచ్చి కొండపోచమ్మ సాగర్‌ను నింపారని, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా కాళేశ్వరాన్ని నిర్మించారని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజ్‌లలో 340 పిల్లర్లు ఉండగా, ఒక పిల్లర్ పగిలితే కాంగ్రెస్ నాయకులు నానా యాగి చేశారని, కాంగ్రెస్ నాయకులు దున్నపోతు ఈనింది అంటే బీజేపీ వాళ్లు దుడ్డే కట్టేయమన్నట్టు కాళేశ్వరంపై దుష్ప్రచారం చేసి తెలంగాణ ప్రజల మనసుల్లో విష బీజాలు నాటారని ఆరోపించారు.

సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయినా, ఎస్ ఎల్ బి సి టన్నెల్ కూలిపోతే, ఖమ్మం పెద్దవాగు బ్రిడ్జి కొట్టుకపోతే ఏ బీజేపీ నాయకుడూ మాట్లాడడం లేదని, ఇవాళ రేవంత్ ప్రభుత్వానికి రక్షణ కవచంలా ప్రధాని మోడీ పనిచేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం పిల్లర్ పగిలినప్పుడు హడావుడి చేసిన ఎన్‌డీఏ, ఈ ప్రమాదాల విషయంలో మౌనంగా ఎందుకు ఉందని ప్రశ్నించారు. సుంకిశాల ప్రమాదంపై వివరాలు ఇవ్వాలని ఆర్టీఐ కింద అడిగితే, దేశ భద్రతకు సంబంధించినదని రేవంత్ ప్రభుత్వం చెబుతోందని తెలిపారు. తెలంగాణలో రాహుల్-రేవంత్ టాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధానమంత్రి మోడీ ఆరోపించినా, ఇప్పటిదాకా బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

రెండు కోట్ల లాభం మాత్రమే ఆర్జించిన రేవంత్ బామ్మర్దికి సంబంధించిన శోధా కంపెనీకి 1137 కోట్ల అమృత్ కాంట్రాక్టును రేవంత్ రెడ్డి అక్రమంగా కట్టబెట్టారని, దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి ఆరు నెలలైనా చర్యలు లేవని ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఈడీ దాడులు జరిగినా, ఇప్పటిదాకా ఏం జరిగిందో ఈడీ బయటపెట్టలేదన్నారు. తెల్లారితే కేసీఆర్‌ను విమర్శించే రేవంత్ రెడ్డి, బీజేపీని ఒక్క మాట కూడా అనడని, బీఆర్ఎస్, కేసీఆర్ ఉన్నంత వరకు కాంగ్రెస్, బీజేపీల పప్పులు ఉడకవని కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు.

లగచర్లలో తన అల్లుడి ఫ్యాక్టరీకి భూములు ఇవ్వనందుకే అక్కడి రైతులపై రేవంత్ అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారని, లగచర్ల లంబాడ సోదరుల కోసం ఢిల్లీ వరకు వెళ్లి కొట్లాడి బెయిల్ తెప్పించినట్లు కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద పెడతామంటూ కొడంగల్ నియోజకవర్గంలోనే తిరుగుబాటు మొదలైందని, కడియం శ్రీహరికి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని, అక్కడ బీఆర్ఎస్ బంపర్ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారని, బీఆర్ఎస్‌కు ఓటు వేయనందుకు బాధపడుతున్నారని, రేవంత్‌ను చూసిన తర్వాతే కేసీఆర్ విలువ అర్థమవుతుందని అన్నారు. రైతుల ఖాతాల్లో టకీ టకీమని పైసలు పడతలేవు కానీ, ఢిల్లీలో ఉండే రాహుల్ గాంధీకి మాత్రం రేవంత్ టకీ టకీమని పైసలు పంపుతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేశారని, పది నెలల కేసీఆర్ పాలనలో సంవత్సరానికి 41 వేల కోట్ల అప్పు చేసి సంక్షోభంలో ఉన్న విద్యుత్ రంగాన్ని సంస్కరించామని, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం కట్టామని, మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచినీళ్లు ఇచ్చామని తెలిపారు.

రైతుబంధు రూపంలో 73 వేల కోట్ల రూపాయలను 70 లక్షల రైతుల ఖాతాల్లో వేశామని, 28 వేల కోట్లతో రెండుసార్లు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేశామని, జిల్లాకొక మెడికల్ కాలేజీ, వరంగల్లో అతిపెద్ద హాస్పిటల్, ఘన్పూర్‌లో కాళోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్, అతిపెద్ద టెక్స్‌టైల్ పార్క్, 200 గురుకుల పాఠశాలలను 1000కి పెంచామని వివరించారు. సంవత్సరానికి 40 వేల కోట్ల అప్పుతో ఈ కార్యక్రమాలు చేశామని, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 14 నెలల్లో 1,50,000 కోట్ల అప్పు చేసి ఒక్క ప్రాజెక్ట్ కూడా ప్రారంభించలేదని, కొత్తగా ఒక్క ఇటుకైనా పేర్చలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతుబంధుకు రామ్ రామ్ అవుతుందని కేసీఆర్ ముందే చెప్పారని, ఈ లక్షన్నర కోట్ల అప్పుతో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారని విమర్శించారు.

స్టేషన్ ఘన్పూర్‌లో రాజయ్య నేతృత్వంలో బీఆర్ఎస్ అద్భుతంగా పనిచేస్తోందని, సంస్థాగతంగా పార్టీని నిర్మించుకుందామని, తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీలేకుండా కొట్లాడేది కేసీఆర్, గులాబీ సైన్యమేనని పిలుపునిచ్చారు. పార్టీ రజతోత్సవ సంబరాలను ఘనంగా జరుపుకుందామని కేటీఆర్ ప్రకటించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com