కుంభమేళా నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని పుణ్య క్షేత్రాలకు పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తున్నారు. కుంభమేళా కోసం ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు అచరించే భక్తులు ఆ తర్వాత అయోధ్య, వారణాసి, చిత్రకూట్ తదితర పుణ్యస్థలాలకు వెళుతున్నారు. కుంభమేళాకు వెళ్లేవారిలో మెజారిటీ భక్తులు అయోధ్యలో కొలువుదీరిన రామ్‌లల్లాను దర్శించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
రోజూ లక్షల సంఖ్యలో బాల రాముడిని దర్శించుకుంటున్నారు. ఇంకా నిర్మాణ దశలోనే ఉన్న ఆ ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. దీంతో అయోధ్య వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రతి క్షణం వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. రామ జన్మభూమి స్థలంలో నిర్మించిన నూతన ఆలయానికి అపరిమిత సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. కుంభమేళా నుంచి డైరెక్టుగా అయోధ్య చేరుకుంటున్నారు. అనేక లైన్లలో భక్తుల్ని రామయ్య దర్శనం కోసం పంపించే ఏర్పాట్లు చేశారు.
మరోవైపు కుంభమేళాకు అంచనాలకు మించి భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటి వరకు 64 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. రేపు శివరాత్రితో మహా కుంభమేళా ముగియనుంది. దీంతో రేపు ఒక్క రోజే సుమారు 15 కోట్ల మంది త్రివేణి సంగమం చేరుకుంటారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో భక్తులకు ఇబ్బందులు ఏర్పడకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.