ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కావడానికి ముహుర్తం ఖరారు చేశారు. వచ్చేనెల 15వ తేదీ నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. అమరావతి రాజధాని ప్రాంతంలో వివిధ రకాల పనులు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే టెండర్లను ఆహ్వానించింది. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందన్న కారణంగా పనులు ప్రారంభించడంలో జాప్యం జరిగింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో టెండర్ల ఖరారులో ఆలస్యం జరిగింది. అయితే, టెండర్లు పిలిచేందుకు ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున టెండర్లను ఖరారు మాత్రం చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది.
అమరావతి రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి ఇప్పటి వరకు 62 పనులకు సీఆర్‌డీఏ అధికారులు టెండర్లు పిలిచారు. వాటిలో రూ.42 వేల కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే మరో 11 పనులకు కూడా టెండర్లు పిలిచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. టెండర్లు పిలిచేందుకు ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇవ్వటంతో త్వరలోనే టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
మార్చి 15వ తేదీ నుంచి అమరావతి ప్రాంతంలో పనులు మొదలు కానుండగా.. ఏప్రిల్ నుంచి నిర్మాణ పనులు జోరందుకునే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్ మొదటి వారం నుంచి 30 వేల మంది కార్మికులతో అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. జంగిల్ క్లియరెన్స్ పనులు కూడా ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో నిర్మాణ పనులు వేగంగా జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు.. తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 మధ్య కాలంలో అధికారంలో ఉన్న సమయంలో రాజధాని అమరావతిలో ఎన్‌ఆర్‌టీ ఐకనిక్ భవనం నిర్మాణం చేయాలని నిర్ణయించారు. అప్పట్లోనే ఈ భవనానికి శంకుస్థాపన జరిగింది. అయితే, 2019 ఎన్నికల్లో గెలిచి వైసీపీ అధికారంలోకి రావటంతో ఎన్ఆర్‌టీ ఐకనిక్ భవనం నిర్మాణం ప్రతిపాదన అటకెక్కింది. ప్రస్తుతం కూటమి సర్కారు అధికారంలోకి రావటంతో ఎన్‌ఆర్‌టీ ఐకన్ భవనం నిర్మాణానికి మళ్లీ అడుగులు పడుతున్నాయి. ఇందుకోసం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మాణ కమిటీని నియమించింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటయ్యింది. ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సీఈవో మెంబర్ కన్వీనర్‌గా, టర్నర్ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ నుంచి ఒక సాంకేతిక సభ్యుడు, ఐదుగురు సభ్యులు ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.