మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన స్కిట్ తీవ్ర వివాదాస్పదమైంది. కామెడీ షోలో షిండేను దేశ ద్రోహిగా పేర్కొంటూ ఓ పాట పాడారు. దీంతో మహా రాజకీయాలు భగ్గుమన్నాయి. కమ్రాపై శివసేన నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ముంబై ఖార్ ప్రాంతంలోని హాబిటాట్ కామెడీ క్లబ్‌లో కునాల్ కమ్రా షో జరిగింది. షోలో భాగంగా కమ్రా మహా రాజకీయాలపై మాట్లాడారు. డిప్యూటీ సీఎంను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ దేశ ద్రేహి అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఎక్స్‌లో పోస్టు చేస్తూ ‘కునాల్ కా కమల్’ అంటూ ఎద్దేవా చేశారు. దీంతో ఈ అంశం కాస్తా వివాదాస్పదమైంది. కమెడియన్‌పై శివసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు షో జరిగిన హోటల్‌పై దాడి చేశారు. అప్రమత్తమైన పోలీసులు కొందరు శివసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కమెడియన్‌పై శివసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కమ్రాపై కేసు నమోదు చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో క్లబ్‌ను మూసివేస్తున్నట్లు హాబిటాట్ స్టూడియో ప్రకటించింది.
దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కామెడీ పేరుతో ఇతరులను అగౌరవపరచడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. కమ్రా తీరును తీవ్రంగా ఖండించారు. ‘నేను హాస్యానికి వ్యతిరేకం కాదు. ఆ పేరుతో ఇతరులను అగౌరవపరచడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. డిప్యూటీ సీఎంను అగౌరవపరచడం సరికాదు. ఈ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలి’ అని సీఎం పేర్కొన్నారు.