- వివిఐపీ అనుమతుల రద్దు
- ఇకపై వన్ వే ట్రాఫిక్… ఒకే ఎంట్రీ, ఒకే ఎగ్జిట్
- ప్రత్యేక వాహనాల ఎంట్రీకి నో ఛాన్స్
- వసంత్ పంచమి రద్దీని తట్టుకోడానికే
- అయోధ్య, వారణాసి, చిత్రకూట్ ల దగ్గరా ఆంక్షలు
- వారణాసిలో నైట్ షెల్టర్ల ఏర్పాటు
- కుంభమేళా ఎంట్రీ పాయింట్ కు స్పెషల్ బస్సులు
- అయోధ్య దగ్గర భద్రత కట్టుదిట్టం
కుంభమేళాలో వరుసగా జరుగుతున్న విషాదకర సంఘటనల రీత్యా నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చారు. అసలే మరో మూడు విశిష్ట తిథులు ఉండటంతో మరో తొక్కిసలాట జరగకుండా ఉండేందుకు రూల్స్ లో కొన్ని మార్పులు చేశారు. ఇకపై కుంభమేళా ప్రాంగణంలోకి వాహనాలను అనుమతించడం లేదు. కేవలం అంబులెన్సులను మాత్రమే అనుమతిస్తారు. రద్దీని తట్టుకోడానికి, భక్తులు ప్రశాంతంగా స్నానాలు, పూజలు ముగించుకుని వెనుదిరిగేందుకు ఈ మార్పులు చేశారు.
కుంభమేళాకు వచ్చే భక్తులు తిరుగు ప్రయాణంలో అయోధ్య, వారణాసి, చిత్రకూట్ లను కూడా తప్పనిసరిగా సందర్శిస్తుండటంతో ఆయా ఆలయాల దగ్గర విపరీతమైన రద్దీ ఏర్పడుతోంది. దాంతో అక్కడి అధికారులను కూడా అలెర్ట్ చేశారు. అంత దూరాలనుంచి వాహనాల్లో వచ్చే వారు ఇకపై మేళా ప్రాంగణంలో తమ వాహనాలను నిలిపే వీలులేదు. అసలు కుంభమేళా ప్రాంగణంలోకే వారికి అనుమతి లేదు. ఆ ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ గా ప్రకటించారు. దీనికి తోడు వివిఐపీ లకు ప్రత్యేక అనుమతులను కూడా రద్దు చేసేశారు.
వన్ వే ట్రాఫిక్..
కుంభమేళాకు వచ్చే వారు ఇకపై వన్ వే ట్రాఫిక్ లో రావాలి. ఒకే ఎంట్రీ, ఒకే ఎగ్జిట్ పాయింట్లను పెట్టారు. చివరకు అధికారులకు కూడా అనుమతులు పరిమితం చేశారు. వారు వారి వాహనాలను ప్రయాగ్ రాజ్ లో సిటీ సరిహద్దుల్లోనే వదిలేసి నడక మార్గంలోనే చేరుకోవాలి.
వసంత్ పంచమి కోసం..
కొత్త నిబంధనలను మూడో తేదీన రానున్న వసంత పంచమిని దృష్టిలో ఉంచుకుని అమల్లోకి తెచ్చారు. కుంభమేళాలో భక్తుల రద్దీని, క్రౌడ్ మేనేజ్ మెంట్ ను ప్రత్యేకంగా పర్యవేక్షించేందుకు ఐదుగురు సీనియర్ అధికారులను రంగంలోకి దింపారు.వీరంతా గతంలో ప్రయాగ్ రాజ్ నుంచే మానిటర్ చేసేవారు. కానీ ఇప్పుడు కుంభమేళా ప్రాంగణంలోనే ఆరోజంతా ఉండి భక్తులు సజావుగా వచ్చి వెళ్లేలా పరిస్థితిని సమీక్షిస్తుంటారు. మూడో తారీఖున వసంత పంచమి పర్వదినం కోసం ఈ కొత్త మార్పులు చేశారు.
రవాణా సౌకర్యాలు
రైళ్లలో, బస్సుల్లో కుంభమేళాకు తరలి వచ్చే వారికోసం స్టేషన్లు, బస్టాండ్ ల నుంచి అనేక బస్సులను మేళా ప్రాంగణం ఎంట్రీ వరకూ ఏర్పాటు చేశారు. యూపీ రాష్ట్ర రోడ్డు రవాణా వ్యవస్థ అదనపు బస్సులను రంగంలోకి దింపింది. భక్తులు కుంభమేళా ఎంట్రీ పాయింట్ లో దిగి అక్కడనుంచి లోపలికి నడుచుకుని వెళ్లాలి. ఆ తర్వాత ఎగ్జిట్ పాయింట్ కు చేరుకుని అక్కడ నుంచి బస్సుల్లో తిరిగి వెనక్కు వెళ్లాలి.
అయోధ్యకు పెరిగిన రద్దీ
కుంభమేళాకు వస్తున్న భక్తులు తిరుగు ప్రయాణంలో అయోధ్య బాలరాముని దర్శనం చేసుకుంటున్నారు. దీంతో అయోధ్య పరిసరాల్లో విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. దాంతో అక్కడ కూడా భద్రతను పెంచారు.
నైట్ షెల్టర్లు ఏర్పాటు
కుప్పలు తెప్పలుగా తరలి వస్తున్న భక్తుల సౌకర్యం కొసం వారణాసిలో నైట్ షెల్టర్లు కూడా అందుబాటులోకి తెచ్చారు. భక్తులు చివరగా వెళ్లే చిత్రకూట్ దగ్గర కూడా ఆంక్షలు అమల్లో ఉంటాయి. కుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాట నేపధ్యంలో యోగీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.