35.9 C
Hyderabad
Thursday, June 4, 2026

Live Video

spot_img

రేపటినుంచి నెల్లూరులో సీపీఎం రాష్ట్ర మహాసభలు

కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఆదరించడంలో నెల్లూరు జిల్లా మొదటినుంచీ ముందు వరుసలో ఉంటుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు జెట్టి శేషారెడ్డి అన్నారు. ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో నెల్లూరులో సిపిఎం రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మహాసభలకు కేంద్ర నాయకులు బృందాకరత్, బివి రాఘవులు, ఎంఏ బేబీ తదితర ప్రముఖులు హాజరవుతున్నారని వెల్లడించారు.ఎమర్జెన్సీ సమయం తర్వాత 1978లో నెల్లూరులో సీపీఎం 13వ రాష్ట్ర మహాసభలు జరిగాయని గుర్తు చేశారు. అప్పటి కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య నేతృత్వంలో ఆ మహాసభలు జరిగాయన్నారు. ఇప్పుడు 48 సంవత్సరాల తర్వాత మళ్లీ నెల్లూరులో రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయన్నారు. కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఆదరించడంలో నెల్లూరు జిల్లా ప్రజలు ముందుంటారని ఆయన చెప్పారు. మహాసభలకు గుర్తింపుగా మూడు రోజుల పాటు జరిగిన కళాకారుల సాంస్కృతిక ఉత్సవాలను ప్రజలు ఆదరించారని, కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు అందరినీ ఆకట్టుకున్నాయన్నారు.

మహాసభల నేపథ్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి ఐదు పతాకయాత్రలు మొదలయ్యాయని శ్రీనివాసరావు చెప్పారు. ఆ పతాకయాత్రలన్నీ మహాసభల సమయానికి నెల్లూరుకు చేరుకుంటాయన్నారు. రాష్ట్రంలోని ఐదు ప్రధాన సమస్యలకు నిదర్శనంగా ఐదు పతాకయాత్రలు మొదలయ్యాయన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ డిమాండ్‌తో విశాఖపట్నం నుంచి మొదటి పతాకయాత్ర బయలుదేరిందన్నారు. అలాగే, పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని, ప్రాజెక్టుకోసం ఇళ్లు, భూములు కోల్పోయిన రెండున్నర లక్షలమంది పునరావాసానికి నిధులు కేటాయించాలన్న డిమాండ్‌తో ఏజెన్సీ ప్రాంతం నుంచి రెండో పతాకయాత్ర బయలుదేరిందన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా రాజధాని విషయంలో ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకోకుండా.. అమరావతి శాశ్వత రాజధాని అని ప్రత్యేక చట్టం తేవాలన్న డిమాండ్‌తో మూడో పతాకయాత్ర తాడేపల్లి నుంచి బయలుదేరిందన్నారు. రాయలసీమలోని వేల ఎకరాల భూములను సోలార్‌ ఎనర్జీ పేరుతో కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టారని, ఆ అక్రమ ఒప్పందాలన్నీ రద్దుచేయాలన్న డిమాండ్‌తో నంద్యాల నుంచి నాలుగో పతాకయాత్ర బయలుదేరిందన్నారు. ఇక.. రాష్ట్ర విభజన చట్టంలో ముఖ్యమైన అంశమైన కడపలో ఉక్కుఫ్యాక్టరీ డిమాండ్‌ కనుమరుగైపోయిందని, పదేళ్లయినా కనీసం పునాది రాయి కూడా పడలేదని, అందుకే కడపలో ఉక్కుఫ్యాక్టరీ డిమాండ్‌తో ఐదో పతాకయాత్ర అక్కడినుంచి బయలుదేరి నెల్లూరు వైపు వస్తోందన్నారు. సీపీఎం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేసేందుకు అన్ని వర్గాల వారూ సహకరించాలని శ్రీనివాసరావు కోరారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com