తెలంగాణలో మరో స్థానికసంస్థల పదవీ కాలం ముగిసింది. ఈరోజుతో రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌లలో పాలకమండళ్ల పదవీ కాలం ముగిసింది. దీంతో, రేపటినుంచి రాష్ట్రంలోని మున్సిపాలిటీలన్నింటిలో ప్రత్యేక అధికారుల పాలన మొదలు కానుంది.
మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పదవీకాలం ముగిసిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ కాసేపటిక్రితం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో.. రేపటినుంచి రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అన్నీ ప్రత్యేక అధికారుల పరిపాలనలోకి వెళ్లబోతున్నాయి. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రత్యేక అధికారుల వివరాలను ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది.
2020లో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు. వాటి పదవీ కాలం ఐదేళ్లు ఇవాల్టితో పూర్తయ్యింది. వాస్తవానికి ఐదేళ్ల పదవీ కాలం ముగియడానికి ముందే స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించి, నూతన పాలక వర్గాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ వివిధ కారణాలతో ప్రభుత్వ ఇప్పటి వరకు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించలేదు. దాంతో.. ఆయా పాలక వర్గాల స్థానాల్లో ప్రత్యేక అధికారుల్ని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలోని మొత్తం 10 మున్సిపల్ కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు జనవరి 26వ తేదీతో పదవీకాలం ముగిసిపోయింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం పదవీ కాలం మాత్రం రెండు రోజుల తర్వాత.. ఈనెల 28వ తేదీతో ముగుస్తుంది. దీంతో మున్సిపాలిటీల్లో పాలనా వ్యవహారాలన్నీ ప్రత్యేక అధికారుల పరిధిలోకి వెళ్తున్నాయి. మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించి కొత్తగా పాలకమండళ్లు ఏర్పాటయ్యేదాకా స్పెషల్ ఆఫీసర్ల పాలనలోనే మున్సిపాలిటీలు ఉంటాయి. దీనికోసం ఆయా జిల్లాల వారీగా ప్రత్యేక అధికారుల్ని ప్రభుత్వం ఎంపిక చేసి.. వారికి బాధ్యతలు అప్పగించింది. కాగా.. నర్సాపూర్ మున్సిపాలిటీని మంచిర్యాల, కొత్తపల్లి మున్సిపాలిటీని కరీంనగర్ మున్సిపాలిటీలో విలీనం చేయడం ద్వారా రెండు స్థానాలు తగ్గిపోయినట్లు వెల్లడించింది.