హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. హుస్సేన్ సాగర్ నీటిలో పర్యటిస్తున్న ఓ బోటులో మంటలు చెలరేగాయి. బాణసంచా పేలుడుతో బోట్ దగ్దమైంది.
హుస్సేన్ సాగర్‌లో విహరిస్తున్న బోటులోంచి బాణసంచా పేల్చారు. అయితే, ఆ బాణసంచా బోటులో పడటంతో బోటు మొత్తం ఒక్కసారిగా దగ్ధమయ్యింది. బోట్‌లో ఉన్న వాళ్ల హాహాకారాలు ఆ ప్రాంతంలో మిన్నంటాయి.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో భారతమాతకు హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే అపశృతి చోటుచేసుకుంది. వేడుక సందర్భంగా బాణాసంచా కాలుస్తుండగా.. అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో హుస్సేన్ సాగర్‌లోని రెండు బోట్లు అంటుకున్నాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళన పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బోట్ల దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం ఎలా జరిగిందని ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సిఉంది.
రాష్ట్ర సచివాలయం ముందున్న హుస్సేన్‌సాగర్‌లో సాయంత్రం వేళ బోట్ షికార్ల సదుపాయం ఉంటుంది. అయితే, బోట్లలో షికారు చేయడానికి లుంబిని పార్క్ నుంచి ఒక పాయింట్, జలవిహార్‌నుంచి మరో పాయింట్, జలవిహార్ పక్కనే ఉన్న నీరా సెంటర్ నుంచి మరో పాయింట్ ఉంటాయి. ఈ పాయింట్లలో స్పీడ్ బోట్‌తో పాటు.. ఎక్కువమంది ప్రయాణించే పెద్ద బోట్లు కూడా నడుస్తాయి. హుస్సేన్‌సాగర్ జలాల్లోంచి సాగర్ మధ్యలో ఉన్న బుద్ధుడి విగ్రహం దాకా బోట్లు వెళ్తాయి. బుద్ధుడి విగ్రహంపై సందర్శకులు సంచరించాక… ఫోటో షూట్లు పూర్తయ్యాక తిరిగి బోట్లు ఆయా పాయింట్లకు చేరుకుంటాయి.