26.2 C
Hyderabad
Saturday, June 27, 2026

Live Video

spot_img

అమరావతిపై స్పెషల్‌ ఫోకస్‌ – రీ లాంచ్‌కు మోదీకి ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచీ అమరావతిని ప్రధాన అంశంగా తీసుకుంది. ప్రత్యేకంగా కేబినెట్‌ సబ్‌ కమిటీ వేసింది. మంత్రి నారాయణకు పూర్తి స్థాయిలో ఆ పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. అటు.. కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించింది. మరోవైపు.. సీఆర్డీఏ టెండర్ల ప్రక్రియ మొత్తం పర్యవేక్షిస్తోంది. దీంతో, అమరావతి నిర్మాణానికి పునః శంకుస్థాపన చేసేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఢిల్లీ వెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అమరావతి రీ లాంచ్‌ ప్రోగ్రామ్‌కు ప్రధాన మంత్రి నరేంద్రమోదీని ఆహ్వానించనున్నారు.

ఆంధ్ర ప్రదేశ్‌ రాజధాని అమరావతి నగరం స్వయం సమృద్ధి ప్రాజెక్టుగా ఘనంగా పునః శంకుస్థాపనకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ దఫా నిర్మాణ పనులు ప్రారంభించి వచ్చే మూడేళ్ల వ్యవధిలోనే పూర్తి చేసేందుకు కూటమి సర్కారు పట్టుదలగా ఉన్నట్లు పరిణామాలు సూచిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి రీలాంఛ్ కు సిద్ధమవుతోంది.

రాజధానిగా అమరావతి నగరం నిర్మాణం ప్రపంచ స్థాయిలో నిర్మిస్తామంటూ చంద్రబాబు నాయుడు తరచూ ప్రకటిస్తున్నారు. దీంతో, కలల రాజధానికి కొత్త రెక్కలు వచ్చాయి. ఇప్పుడు ఎలాంటి ఆటంకాలు లేవు. అడ్డంకులు కూడా అసలే లేవు. రాజధాని నగర నిర్మాణ రోడ్ మ్యాప్ స్పష్టంగా తయారు చేసుకుంటున్నారు. లక్ష్యం కూడా కళ్లముందే కనిపిస్తూ ఉంది. అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులు కూడా వస్తున్నాయి. నగరం నిర్మాణానికి ఏమేం చేయాలన్నవన్నీ ఖరారయి పోయాయి. ఫలితంగా అమరావతి నగరానికి ఇప్పుడు అన్నీ మంచి శకునాలే కనిపిస్తున్నాయి.

2028 నాటికి రాజధాని నగరం అమరావతి నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యంగా కూటమి సర్కారు ముందుకెళ్తోంది. అన్ని పనులనూ ఒకేసారి మొదలు పెట్టి రాజధాని నిర్మాణ పనులను పునః ప్రారంభించాలనే ఆలోచనలో ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా మరోసారి నిర్మాణ పనుల్ని అట్టహాసంగా మొదలు పెట్టేందుకు కూటమి సర్కారు ఏర్పాట్లు చేస్తోంది.

ఒక్కసారి పని మొదలైందంటే ఆగేదే లేదని కూటమి ప్రభుత్వం చెబుతోంది. 2028 దాకా నాన్ స్టాప్, అన్ స్టాపబుల్ అంతే అంటోంది. మరోవైపు.. గతంలో అమరావతి కోసం చేపట్టిన నిర్మాణాలు స్ట్రాంగ్ గానే ఉన్నాయని టెక్నికల్ కమిటీలు తేల్చాయి. అందుకే, వాటి పనుల్ని మరింత వేగంగా పూర్తి చేయడమే కర్తవ్యమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం ఈసారి గట్టి సంకల్పం తీసుకుంది.

మరోవైపు.. కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా పూర్తిగా ఉండడంతో టార్గెట్‌ లోపు కచ్చితంగా అమరావతిని నిర్మించి తీరుతామని.. జనం ముందుకు అందుబాటులోకి తెస్తామని మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది కూటమి ప్రభుత్వం. ఎవరు వచ్చినా.. మరెవరు పాలించినా.. రాజధానిగా అమరావతి చెరిగిపోని ముద్ర వేసేలా, చరిత్ర సృష్టించేలా తీర్చి దిద్దుతామంటోంది సర్కారు.

గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ ప్రాంతంలోనే రాజధానిని నిర్మిస్తామని ప్రకటించి.. 58 రోజుల్లోనే 34 వేల ఎకరాల భూములు సేకరించింది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం రూ.64 వేల కోట్లు అవసరమవుతున్నాయి. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన, మంజూరైన నిధులతో ఒక అడగు ముందుకు పడితే.. మిగతా పనులన్నీ వెంట వెంటనే జరిగిపోయేలా చూస్తామంటోంది ప్రభుత్వం. సహజంగానే రాజధాని అనేది అవకాశాలను సృష్టిస్తుంది. ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తుంది. సదుపాయాలను పెంచుతుంది. అంతేకాదు.. సంపదను కూడా సృష్టిస్తుంది. ఇక, కూటమి ప్రభుత్వం అమరావతికి పీపుల్స్ క్యాపిటల్ అని ట్యాగ్‌లైన్‌ ఇచ్చింది. అందరినీ ఆకర్షించేలా, ఉపాధి అవకాశాలు పెంచేలా, ప్రపంచ‌ంలోనే టాప్-5 నగరాల్లో ఒకటిగా ఉండేలా ఈ నగరాన్ని డిజైన్‌ చేశారు. దీంతో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు.. మెరుగైన మౌలిక వసతులు కూడా అమరావతి ప్రాంతంలో రాబోతున్నాయి. అమరావతి నగరం.. నెక్ట్స్‌ జెనరేషన్ క్యాపిటల్ సిటీ అని ప్రభుత్వం గొప్పగా చెబుతోంది.

ఇప్పటికే రాజధాని అమరావతిలో 40 వేల కోట్ల రూపాయల విలువైన నిర్మాణ పనులకు సీఆర్‌డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజధానిలో నిర్మాణ పనులు దక్కించుకున్న కాంట్రాక్టు ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పూర్తికాగానే రాజధానిలో పనులు ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది. 73 పనులకు సీఆర్‌డీఏ నుంచి అనుమతి వచ్చింది. 63 పనులకు టెండర్లు పూర్తి చేశారు. వాటి విలువ రూ.39,678 కోట్లుగా ఉంది. అమరావతిలో గ‌వ‌ర్నమెంట్ కాంప్లెక్స్‌లో ఇళ్లు, భ‌వ‌న నిర్మాణాలు, ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధి కోసం మొత్తంగా రూ.64,721 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. వివిధ రకాల ఆదాయ మార్గాల ద్వారా అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేసేలా సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అమరావతికి వరల్డ్ బ్యాంకు, ఏడీబీ బ్యాంకు క‌లిపి రూ.13,400 కోట్లు రుణంగా ఇస్తుండగా, కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంక్ రూ.5,000 కోట్లు రుణంగా అందిస్తోంది. అటు.. హ‌డ్కో రూ.11,000 కోట్లు అప్పుగా ఇవ్వబోతోంది. అయితే, ఈ అప్పులను ఎఫ్ఆర్‌బీఎం పరిధిలోకి తీసుకురాబోమని కేంద్రం తాజాగా పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది. ఈ రుణాలను ఆంధ్రప్రదేశ్ అప్పుల పరిమితిలో లెక్కించకూడదని నిర్ణయించినట్లు పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు.

2014-19 మధ్య కాలంలో 131 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రతిష్ఠాత్మక సంస్థలకు 1,277 ఎకరాలు ఇచ్చారు. అయితే, గత ఐదేళ్లు రాజధాని నిర్మాణం జరగకపోవడంతో ఆ సంస్థల్లో కొన్ని వెనక్కు వెళ్లాయి. భవనాలు నిర్మించుకునేందుకు ఆసక్తి చూపించలేదు. ఇందులో ఆర్‌బీఐ, బిట్స్ పిలానీ సహా కీలక సంస్థలు కూడా ఉన్నాయి. ఇప్పుడు.. మళ్లీ కదలిక వస్తోంది. తాజాగా 31 సంస్థలకు 629 ఎకరాలు భూమి ఇచ్చారు. గత ప్రభుత్వం ఆర్‌-5 జోన్‌లో 50 వేల మందికి ఒక సెంటు భూమి అమరావతిలో ఇచ్చింది. అయితే, వారికి వేరేచోట భూమి కేటాయిస్తామని కూటమి ప్రభుత్వం అంటోంది. కూటమి సర్కారు వచ్చాక 8 నెలల్లోనే టెండర్లు ఆహ్వానించింది. ఏప్రిల్‌ నెల నుంచి అమరావతి అభివృద్ధి పనుల్లో 20 వేల మంది పాల్గొనబోతున్నారు. ఎన్టీఆర్‌ విగ్రహం, ఐకానిక్‌ బ్రిడ్జ్‌ సహా ఇంకెన్నో రాబోతున్నాయి. ఈ పనులన్నిటికీ ప్రధాని నరేంద్ర మోదీ రీ లాంఛ్ చేయడం ద్వారా నాన్ స్టాప్‌గా జరగబోతున్నాయి. అటు.. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి చేసిన ప్లాట్లను మూడేళ్లలో రైతులకు అప్పగిస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com