38.2 C
Hyderabad
Saturday, April 25, 2026

Live Video

spot_img

42 శాతం బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీ ఆమోదం

తెలంగాణ శాసనసభ కీలక బిల్లులను ఆమోదించింది. అన్నింటిలో ముఖ్యమైంది బీసీ రిజర్వేషన్ బిల్లు. దీంతో ఇప్పుడు ఈ బిల్లును కేంద్రానికి పంపించనున్నారు. అక్కడ ఆమోదం కోసం పార్టీలన్నీ ఐక్యంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రభుత్వం కోరింది. దీనికి బీఆర్‌ఎస్ ఓకే చెప్పింది. ఎప్పటి నుంచో పెద్ద చర్చకు దారి తీసిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు సభ ముందుకు ప్రభుత్వం ఇవాళ తీసుకొచ్చింది. బీసీ రిజర్వేషన్ బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ పెడితే… ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రవేశ పెట్టారు.

బిల్లు ప్రవేశ పెట్టే సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఇదో చారిత్రాత్మక ముందడుగుగా అభివర్ణించారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా కులగణన చేపట్టి రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశంతో పక్కా లెక్కలతో సభ ముందుకు బిల్లు తీసుకొచ్చామని వివరించారు. అన్ని పార్టీలు దీన్ని ఉద్దేశాన్ని గ్రహించి బిల్లుకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లు సందర్భంగా మాట్లాడిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే బాధ్యత అన్ని పార్టీలు తీసుకోవాలని సూచించారు. దీన్నో రాజకీయ ఎత్తుగడగా ప్రభుత్వం చూడొద్దని సూచించారు. తమిళనాడు స్ఫూర్తితో పార్టీలను ప్రభుత్వం ముందుండి నడిపించాలని అన్నారు.

శాసనసభలో ప్రవేశ పెట్టిన బీసీ బిల్లుపై మాజీ మంత్రి హరీష్ రావు కూడా మాట్లాడారు. పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టిన బీసీ బిల్లును బీఆర్ఎస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్టు తెలిపారు. చట్టం వచ్చే వరకు అన్ని విధాలుగా మద్దతు ఉంటుందని తేల్చి చెప్పారు. విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చినప్పుడే ఆ వర్గాలు నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతాయన్నారు. స్థానిక సంస్థల్లో, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 42 శాతం రిజర్వేషన్ ఫలితాలు అందినప్పుడు సంతోషపడతాయని అభిప్రాయపడ్డారు. ఆ ఫలితాలు వారికి అందాలని ఆకాంక్షించారు. రాష్ట్ర శాసనసభలో బీసీ రిజర్వేషన్ బిల్లు ఏర్పాటు చేయడంతోపాటు పార్లమెంటులో పోరాటానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుందని హరీష్‌ ప్రకటించారు. ఈ బిల్లు పాస్ కావాలంటే ప్రతిపక్షంలో 100 మంది ఎంపీలు ఉన్నారని.. దీనిపై రాహుల్ గాంధీ గట్టిగా పూనుకంటే బిల్లు మద్దతు పొందుతుందన్నారు. బీసీ బిల్లు ఆమోదం కోసం ఢిల్లీకి సైతం వచ్చి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఆమోదం విషయం పార్లమెంట్ చేతిలో ఉంది కాబట్టి భేషజాలకు పోకుండా ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో బీసీ సబ్ ప్లాన్ చేర్చాలని సూచించారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com