ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా వలంటీర్ల తొలగింపుపై శాసన మండలిలో తీవ్ర చర్చ జరిగింది. వాలంటీర్లు ఎవ్వరూ లేరని, వాళ్లను రెన్యూవల్ చెయ్యలేదని మంత్రి బాలా వీరాంజనేయ స్వామి చెప్పడంతో మండలిలో దుమారం చెలరేగింది.
దీంతో, ఏపీలో వలంటీర్ల తొలగింపు అంశంపై శాసన మండలిలో అధికార కూటమి వర్సెస్ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలుగా పరిస్థితి నెలకొంది. వలంటీర్లను తొలగించామన్న తొలగింపు ప్రకటనపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, వరుదు కల్యాణి మాట్లాడుతూ.. వలంటీర్ల వేతనాన్ని రూ.10 వేలకి పెంచుతామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, ఇప్పుడేమో.. అసలు వలంటీర్ వ్యవస్థనే లేదని చెబుతున్నారని అన్నారు. వలంటీర్లను తొలగించాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంటే.. 2024 సెప్టెంబర్ నెలలో వరదలు వచ్చినప్పుడు వాళ్లతో ఎలా డ్యూటీ చేయించారని ప్రశ్నించారు. గత యేడాది నవంబర్ దాకా వాళ్లకు సీఎఫ్ఎంఎస్ ఐడీలు ఎలా కొనసాగించారో చెప్పాలని సర్కారును నిలదీశారు. కూటమి సర్కారు 2,56,000 మంది వాలంటీర్ల ఉద్యోగాలు తొలగించి, వారిని రోడ్డున పడేసిందని, ఎన్నికలకు ముందు ఆశ పెట్టి వాళ్లను మోసం చేసిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2023 ఆగస్టు నుంచే ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్లు వ్యవస్థ లేదని కూటమి ప్రభుత్వంలోని మంత్రులు దారుణంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆ వ్యవస్థ లేకపోతే ఎన్నికల మేనిఫెస్టోలో వలంటీర్ల గురించి ఎందుకు చేర్చారని ప్రశ్నించారు.
2024 ఏప్రిల్ నెలలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఊరూరికీ తిరిగిన కూటమి పార్టీల నేతలు.. రాష్ట్రంలో వలంటీర్ల జీతాలు పెంచుతామని హామీ ఎలా ఇచ్చారని ప్రభుత్వాన్ని వరుదు కళ్యాణి ప్రశ్నించారు. జీతం పెంచగానే చించినాడా పూత రేకులు ఇవ్వండి అని కూడా అప్పుడు ప్రచారం చేశారని, ఇప్పుడేమో.. ఏకంగా 2.6 లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలంటీర్లు ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారికి అన్యాయం చేయకూడదని ప్రభుత్వాన్ని వైసీపీ ఎమ్మెల్సీ కల్యాణి కోరారు.
మరో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. వలంటీర్లు లేకపోతే.. వరదల సమయంలో విపత్తు శాఖ ఎందుకు ఆదేశాలు ఇచ్చిందని ప్రశ్నించారు. లేని వలంటీర్ వ్యవస్థను వరదల సమయంలో ఎలా వినియోగించారని ఆయన నిలదీశారు.