33.2 C
Hyderabad
Friday, May 1, 2026

Live Video

spot_img

ఎన్‌ఐఏ చేతిలో ఉగ్ర మాడ్యూల్‌ మూలాలు

పహల్గామ్ బైసరన్ లోయలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఘటన జరిగిన ప్రాంతంలో త్రీడీ మ్యాపింగ్, సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేపట్టి, అక్కడున్న వందలాది మంది వాంగ్మూలాలు నమోదు చేసింది. బైసరన్ లోయలోని మూడు కిలోమీటర్ల పరిధిలో ఉండే ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తూ, డ్రైవర్లు, జిప్ రైడర్లు, పోనీ రైడర్లు, ఫొటోగ్రాఫర్లు, టూరిస్టుల వరకు ఎవరినీ వదిలిపెట్టకుండా విచారించింది. దాడికి ముందే ఉగ్రవాదులు భారత భూభాగంలోకి ప్రవేశించి, ఓవర్ గ్రౌండ్ వర్కర్ల సహకారంతో స్థానికుల మద్దతు తీసుకున్నారని ఎన్‌ఐఏ భావిస్తోంది.

దాడిలో పాల్గొన్న ఇద్దరు పాకిస్తానీయులను హష్మీ ముసా అలియాస్ సులేమాన్, అలీ భాయ్ అలియాస్ తల్హా భాయ్‌లుగా గుర్తించారు. వారు పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయంలో ISI ఆదేశాలతో ప్లాన్‌ రూపొందించారని భావిస్తున్నారు. దాడికి ముందు వారంతా పాక్ హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరిపారని, సమయం, లాజిస్టిక్స్, ప్లాన్‌ అమలుపై అవసరమైన సూచనలు తీసుకున్నారని విచారణలో బయటపడింది.

ఎన్‌ఐఏ అధికారికంగా కేంద్ర హోం మంత్రిత్వశాఖకు సమగ్ర నివేదికను సమర్పించేందుకు సిద్ధమవుతోంది. దాడి ప్రదేశంలో 40కి పైగా బుల్లెట్లు స్వాధీనం చేసుకుని, వాటిని బాలిస్టిక్, రసాయన పరీక్షలకు పంపించారు. మొబైల్ టవర్ల నుంచి డంప్ డేటా సేకరించి, సిగ్నల్స్‌ను విశ్లేషించారు. బైసరన్ పరిసరాల్లో మూడు ఉపగ్రహ ఫోన్లు పనిచేస్తున్నట్లు గుర్తించి, వాటిలో రెండింటి నుంచి వచ్చిన సంకేతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

దాడికి సంబంధించి ఇప్పటివరకు 2,800 మందికిపైగా ప్రశ్నించగా, 150 మందిని కస్టడీలోకి తీసుకున్నారు. వీరిలో నిషేధిత సంస్థలైన జమాతే ఇ ఇస్లామి, హురియత్ కాన్ఫరెన్స్‌కు చెందిన అనుమానితులు ఉన్నారు. కుప్వారా, పుల్వామా, సోపోర్, అనంతనాగ్, బారాముల్లా జిల్లాల్లోని అనుమానితుల ఇళ్లల్లో సోదాలు జరిగాయి. 1999 హైజాక్ కేసులో కీలక ఉగ్రవాది ముష్తాక్ అహ్మద్ జర్గర్ అలియాస్ లాట్రమ్ నివాసాన్ని కూడే భద్రతా బలగాలు పేల్చి వేశాయి.

సీసీటీవీ ఫుటేజ్‌లు, భద్రతా తనిఖీ కేంద్రాల డేటా ఆధారంగా ఉగ్రవాదుల కదలికలను ట్రాక్ చేస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలంతో సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేయడానికి కీలక సమాచారం లభించింది. దాడికి పాల్పడిన వారు బాడీ మౌంటెడ్ కెమెరాలు ఉపయోగించి సంఘటనను వీడియోలో రికార్డు చేసినట్లు అనుమానిస్తున్నారు. ఇవన్నీ ఫోరెన్సిక్ పరిశీలనలో ఉన్నాయి.

ఈ దాడి 2024లో సోనామార్గ్ టన్నెల్ సమీపంలో జరిగిన మరో ఉగ్రదాడితో సంబంధం కలిగి ఉందని ఎన్‌ఐఏ గుర్తించింది. ఆ దాడిలో ఏడుగురు కార్మికులు, ఒక వైద్యుడు చనిపోయారు. ఈ దాడుల వెనుక కూడా అదే ఉగ్ర మాడ్యూల్ పని చేసినట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. జునైద్ అహ్మద్ భట్ అనే కార్యకర్త 2024 డిసెంబర్ ఎన్‌కౌంటర్లో హతమవగా, మరో అనుమానితుడు హషీం ముసా రెండు దాడుల్లోనూ కీలక పాత్ర పోషించినట్టు తెలిసింది.

ప్రస్తుతం కశ్మీర్‌లో ఉగ్రదాడుల ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. పర్యాటక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. 87 టూరిజం సెంటర్లలో 48 కేంద్రాలను తాత్కాలికంగా మూసివేశారు. గుల్మార్గ్, సోనామార్గ్, దాల్ సరస్సు వంటి ప్రధాన ప్రాంతాల్లో భద్రతా దళాలు, పోలీసులు భారీగా మోహరించారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com