28.2 C
Hyderabad
Tuesday, September 15, 2026

Live Video

spot_img

ఫైనాన్షియల్ స్ట్రైక్‌తో కుదేలవుతోన్న పాక్

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం సమీపంలో ఉన్న బైసరన్ లోయలో ఏప్రిల్ 22వ తేదీన జరిగిన ఉగ్రదాడి 26 మంది పర్యాటకుల ప్రాణాలు తీసింది. ఈ ఘటన భారత్ – పాకిస్థాన్ సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ దాడి వెనుక పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)’ ఉండొచ్చని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. సీమాంతర ఉగ్రవాదాన్ని తుడిచి పెట్టాలన్న ఉద్దేశంతో భారత్ పాకిస్థాన్‌పై ఫైనాన్షియల్ స్ట్రైక్స్‌కు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పాకిస్థాన్‌ను మళ్లీ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) గ్రే లిస్టులో చేర్చేందుకు భారత్ అంతర్జాతీయంగా ఒత్తిడిని పెంచనుంది. అలాగే, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి పాకిస్థాన్‌కు లభించిన 7 బిలియన్ డాలర్ల రుణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ నిధులు ఉగ్రవాద కార్యకలాపాలకు దారి మళ్లుతున్నట్లు భారత్ ఆరోపిస్తోంది. FATF అనేది 1989లో ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ. ఇది మనీలాండరింగ్, టెర్రరిజం ఫైనాన్సింగ్ వంటి అక్రమ ఆర్థిక కార్యకలాపాలను నిరోధించేందుకు పనిచేస్తుంది. FATF గ్రే లిస్టులో చేరిన దేశాలకు విదేశీ పెట్టుబడులు, రుణాల విషయంలో తీవ్రమైన ఆటంకాలు ఏర్పడతాయి. పాకిస్థాన్ 2018 నుంచి 2022 వరకు గ్రే లిస్టులో ఉండి, 2022లో బయటపడింది. పహల్గాం దాడి నేపథ్యంలో మళ్లీ ఆ జాబితాలోకి చేరే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ పతనావస్థలో ఉంది. ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరల పెరుగుదల, రాజకీయ అస్థిరతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. IMF రుణ సాయాన్ని ఉగ్రవాదానికి దారి మళ్లించడం వల్ల పాకిస్థాన్‌పై అంతర్జాతీయంగా అవిశ్వాసం పెరుగుతోంది. FATF జాబితాలో పాకిస్థాన్ చేరితే, ఆర్థికంగా మరింత ఒత్తిడికి లోనవుతుంది. పహల్గాం దాడి అనంతరం భారత్ తీసుకున్న మరో ముఖ్యమైన చర్య సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం. 1960లో సంతకం చేసిన ఈ ఒప్పందం ప్రకారం సింధు నదీ జలాలను భారత్, పాకిస్థాన్ పంచుకునే విధానం అమలులో ఉంది. దీన్ని నిలిపివేయడం వల్ల పాకిస్థాన్ వ్యవసాయం, జలవిద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది. అంతేకాకుండా, పాక్ పౌరుల వీసాలను భారత్ రద్దు చేసింది, అటారీ–వాఘా సరిహద్దును మూసివేసింది, పాక్ దౌత్యవేత్తలను వెనక్కి పంపించింది.

పహల్గాం దాడి నేపథ్యంలో అంతర్జాతీయంగా ఉగ్రవాదంపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు మొదలయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ ఈ దాడికి పాకిస్థాన్ బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఉగ్రవాద నిర్మూలనలో భారత్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఐక్యరాజ్యసమితి భారత్, పాకిస్థాన్‌లను సంయమనం పాటించాలని సూచించగా, భారత్ ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. అయితే చైనా మాత్రం పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచి, నిష్పక్షపాత విచారణ జరపాలని పేర్కొంది. పహల్గాం దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దర్యాప్తు చేస్తోంది. దాడిలో ముగ్గురు పాకిస్థానీలు, ఒక స్థానిక ఉగ్రవాది పాల్గొన్నట్లు గుర్తించారు. TRF ఈ దాడికి బాధ్యత వహించినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దర్యాప్తులో 10 మందికి పైగా కశ్మీరీలు ఉగ్రవాదులకు సహకరించినట్లు వెల్లడైంది. ఇక, భద్రతా బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేయడంతో పాటు, ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న ఇళ్లను ధ్వంసం చేశాయి.

ఈ దాడి భారత్–పాకిస్థాన్ సంబంధాలను మరింత దెబ్బతీయడమే కాదు, సీమాంతర ఉగ్రవాదంపై భారత్ దృష్టిని మరింత కేంద్రీకరించేలా చేసింది. దౌత్య, ఆర్థిక కౌంటర్ యాక్షన్‌ల ద్వారా పాకిస్థాన్‌పై ఒత్తిడిని పెంచే ప్రయత్నం భారత్ ప్రారంభించింది. దీనికి అంతర్జాతీయ మద్దతును కూడగట్టే పనిలోనూ ఉంది. ఈ చర్యలు పాకిస్థాన్‌లో ఆర్థిక, రాజకీయ అస్థిరతను రేపాయి. మరి.. ప్రపంచ దేశాలన్నీ ఒక్క తాటిపైకి వస్తున్న క్రమంలో పాకిస్తాన్‌ అంతర్జాతీయంగా ఏకాకి అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com