34.2 C
Hyderabad
Tuesday, June 2, 2026

Live Video

spot_img

తెలుగు రాష్ట్రాల్లో సన్నాఫ్‌ లీడర్స్‌ ఎఫెక్ట్‌

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేని స్థాయిలో రాజకీయాల్లో సన్నాఫ్‌ లీడర్స్‌ ఎఫెక్ట్‌ కనిపిస్తోంది. యాదృచ్చికంగా జంట తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ ఈ పరిస్థితి నెలకొనడం చర్చను లేవనెత్తుతోంది. ప్రధానంగా ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ అభ్యర్థుల నియామకం విషయంలో ఈ క్లారిటీ వచ్చింది. పార్టీ అధినేతల మాట కన్నా వాళ్ల కుమారుల మాటే చెల్లుబాటు అయ్యిందన్న ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా రెండు ప్రాంతీయ పార్టీల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో ఐదు చొప్పున మొత్తం పది మంది ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేశారు. అలాగే, తెలంగాణకు వస్తే.. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఒక అభ్యర్తిని ఎంపిక చేయాల్సి వచ్చింది. అయితే, అటు.. ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇటు.. తెలంగాణలోనూ టీడీపీ, బీఆర్‌ఎస్‌లో యువ నాయకుల మాటే నెగ్గిందని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ ఇద్దరు యువ నాయకులు తమ తండ్రులు నడిపిస్తోన్న పార్టీలను శాసిస్టున్నారన్న చర్చ జరుగుతోంది. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లోకేశ్, కేటీఆర్ తమ తండ్రుల నిర్ణయాలను కాకుండా తాము అనుకున్న వారికే ఎమ్మెల్సీ టిక్కెట్లు ఇప్పించుకోవడంలో విజయవంతం అయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎమ్మెల్సీ పోస్టులకు తెలుగుదేశం పార్టీలో 30 మంది దాకా పోటీ పడ్డారు. వారిలో సీనియర్ నేతలు చాలా మంది ఉన్నారు. గత ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని శిరసావహించి టిక్కెట్లు రాకపోయినా పార్టీ విజయం కోసం పనిచేసిన వాళ్లు కూడా ఉన్నారు. దేవినేని ఉమా మహేశ్వరరావు, పిఠాపురం వర్మ, వంగవీటి రాధా ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతాడంత ఉంది. అయితే, చివరకు ఎమ్మెల్సీగా నిన్న మొన్నటి వరకూ ఉన్న బీటీ నాయుడుకు తిరిగి ఎమ్మెల్సీ పదవిని రెన్యువల్ చేశారు. అయితే, నెల్లూరు జిల్లాకు చెందిన బీద రవిచంద్ర, శ్రీకాకుళం జిల్లాకు చెందిన కావలి గ్రీష్మ పేర్లుతెరపైకి రావడం వెనక లోకేశ్ ఉన్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. బీద రవిచంద్ర మొదటి నుంచి పార్టీకి మద్దతుదారుగా ఉంటున్నారు. లోకేశ్‌కు సన్నిహితుడిగా ముద్రపడటం వంటివి కూడా కలిసొచ్చాయి. గ్రీష్మ కూడా మహానాడులో చేసిన ప్రసంగం ఆమెకు పదవి తెచ్చిపెట్టాయంటున్నారు.

ఇక, తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక విషయంలోనూ ఇదే జరిగిందంటున్నారు. పార్టీలో కేసీఆర్ నిర్ణయాలకు తిరుగుండదనేది అందరికీ తెలిసిందే. అయితే, ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికలో మాత్రం కేటీఆర్ తన మాట నెగ్గించుకున్నారని తెలిసింది. బీఆర్‌ఎస్‌కు అసెంబ్లీలో ఉన్న బలాన్ని బట్టి ఒకే ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కుతుంది. అయితే, మహమూద్ ఆలి, సత్యవతి రాథోడ్ పేర్లను కేసీఆర్ పరిశీలించారు. రెండు సామాజికవర్గాలు బలమైనవి కావడంతో వారిలో ఒకరికి ఇవ్వాలని డిసైడ్ అయ్యారని తెలిసింది. ఈ విషయాన్ని బయటకు కూడా చెప్పారట. అయితే, కేటీఆర్ మాత్రం తన సన్నిహితుడు దాసోజు శ్రావణ్‌కు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి మరీ తెప్పించుకున్నారని తెలిసింది. దాసోజు శ్రావణ్ పేరును గతంలోనే ప్రతిపాదించినప్పటికీ.. అప్పుడు గవర్నర్ తిరస్కరించడంతో శ్రవణ్‌కు ఎమ్మెల్సీ పదవి దక్కలేదు. దీంతో శ్రవణ్‌కు ఇప్పుడు పదవి ఇవ్వాల్సిందేనని కేటీఆర్ గట్టిగా పట్టుబట్టి మరీ తన సన్నిహితుడికి టిక్కెట్ ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారని అంటున్నారు. ఇలా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో తనయుల ప్రభావం ఉందంటున్నారు.

మరోవైపు సోదరుడి కోసం పవన్‌ కల్యాణ్‌ తన మాట నెగ్గించుకున్న అంశం కూడా ఆంధ్ర ప్రదేశ్‌లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌.. తన సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ స్థానం పట్టుబట్టి మరీ ఇప్పించుకున్నారు. చంద్రబాబు నాయుడు కూడా కూటమి పొత్తు ధర్మంలో భాగంగా పవన్‌ కల్యాణ్ మాటకు ఓకే చెప్పారు. దీంతో, జనసేన పార్టీ నుంచి నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com